వైఎస్ఆర్ హయాంలో నందిగామ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులిస్తే
సీఎం జగన్ పాలనలో రూ.కోటి రాలేదు : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం :రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలతో ఏం సాధించలేరని, అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన… గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ నేను ఇల్లు కూడా ఇక్కడ కట్టుకున్నా, రాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారని, ఎన్నికల తర్వాత మాటా మార్చారన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయానన్నారు. పార్టీలో ఏడాదిగా ఎన్నో అవమానాలు ఎదురవుతున్నా మౌనంగా సహించానన్నారు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతోన్న తరుణంలో ఆయన వైసీపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.
వైసీపీలో ఎదురైన అవమానాలతో రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం చేసుకోవాలని భావించానని ..తన అనుచరుల మాత్రం రాజకీయాల్లోనే కొనసాగాలని కోరుతున్నారన్నారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మూడు రాజధానుల బిల్లు పెట్టిన రోజు మీటింగ్ పెట్టారని, అప్పుడే ఈ నిర్ణయంపై పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పానన్నారు. తన రాజకీయ ప్రస్థానంపై త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు. మైలవరం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎన్నో ప్రతిపాదనలు చేశారని, అవన్నీ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. ఎమ్మెల్యేగా సీఎం నుంచి ఒక్క రూపాయి సాధించలేకపోయానన్నారు. వైఎస్ఆర్ హయాంలో నందిగామ కోసం రూ.100 కోట్ల నిధులిచ్చారని గుర్తుచేశారు. సీఎం జగన్ పాలనలో రూ.కోటి ఇవ్వలేదన్నారు. పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు కూడా బిల్లులు రాలేదన్నారు.