పడవ ఆకారంలో మందిరం నిర్మాణం
శంఖవరం :శంఖవరం మండలంలోని సిద్ది పుణ్యక్షేత్రంలో కొలువైన ఆంధ్రా శబరిమలై అయ్యప్పస్వామి వారి ఆలయంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పడినెట్టాంబడికి సమీపంలో పడవ ఆకారంలో నిర్మించిన నూతన మందిరంలో కాణిపాకం వినాయకుని నమూనాలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిష్ఠలో భాగంగా విఘ్నేశ్వర పూజ, మండపారాధన, వాస్తు పూజ హోమం, వాయు ప్రతిష్ట, పంచామృత అభిషేకం గావించి ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు గురుస్వామి మాట్లాడుతూ ఇరుముడులతో వచ్చే స్వాములు ముందుగా కన్నె మూల గణపతిని దర్శించుకుని, అనంతరం అయ్యప్పను దర్శించుకునే విధంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించామని, ఎక్కడా లేనివిధంగా పడవ ఆకారంలో మందిరం నిర్మించి విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్నదానం నిర్వహించారు.