నగర పంచాయతీ సమావేశంలో సభ్యుల ఆల్టిమేటమ్
గొల్లప్రోలు
నగర పంచాయతీ పరిధిలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని వైస్ చైర్ పర్సన్ తెడ్లపు అలేఖ్యరాణి తో సహా పలువురు సభ్యులు అల్టిమేట్ జారీ చేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీ సమావేశం మంగళవారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో వైస్ చైర్ పర్సన్ అలేఖ్య రాణి మాట్లాడుతూ 14,15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాలు, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లు, సచివాలయాల పరిధిలో చేపట్టిన పాట్ హోల్స్ పనుల వివరాలు గతంలో లిఖితపూర్వకంగా అడిగామని అలాగే గత సమావేశంలో కూడా ప్రశ్నించినా ఇంతవరకు అధికారులు వివరాలు తెలపక పోవడంతో నేరుగా విజిలెన్స్ అధికారులకు, ఇతర ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఏఈ ప్రభాకర్ పొంతన లేని విధంగా వివరణ ఇవ్వడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నగర పంచాయతీ అత్యవసర సమావేశానికి సంబంధించి ముందు రోజు రాత్రి వరకు సమాచారం ఇవ్వకపోవడంపై అలేఖ్యరాణి తో పాటు కౌన్సిలర్లు దమ్మాల లక్ష్మి, మొగలి దొరబాబు, కూరాకుల శేఖర్, బావిశెట్టి జ్ఞానేశ్వరి, కోఆప్షన్ సభ్యుడు జయబాబు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీకి ట్యాంకర్ ద్వారా చేపడుతున్న త్రాగునీరు సరఫరా పై అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని మైనం భవాని, మొగలి దొరబాబు డిమాండ్ చేశారు. ఎస్సీ పేట స్మశాన వాటికకు 8 లక్షలు మంజూరు చేసామని ప్రకటించినా ఇంతవరకు పనులు ఎందుకు చేపట్టలేదని 4వ వార్డు కౌన్సిలర్ బెందుకుర్తి సత్తిబాబు ప్రశ్నించారు. 16వ వార్డు కౌన్సిలర్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ రోడ్లు మంజూరు చేసామని ప్రకటించినా పనులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ గంధం నాగేశ్వరరావు, గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, కమీషనర్ టి.రవి కుమార్,మేనేజర్ రామ్ ప్రసాద్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.