బల్లకింద చేయిపెట్టడం.. ఇష్టానుసారంగా దోచుకోవడం.. ఇదే కొంత మంది అధికారుల తీరు. కోట్ల రూపాయలు తినేసిన.. అవినీతి అనకొండలు ఎంతో మంది ఉన్నారు. వారందరిపై నిఘా పెడుతోంది ఏసీబీ.ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఏసీపీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నోట్ల కట్టలు.. అక్రమ ఆస్తుల చిట్టా బయటకు వస్తోంది. ఆ అధికారులు ఎవరో.. వాళ్ల బాగోతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు చేస్తోంది. అవినీతి అధికారుల భరతం పడుతోంది. ఇదే క్రమంలో పడమట రిజిస్టర్ అజ్జా రాఘవరావుపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో.. వెంటనే దాడులు చేసిది సీబీఐ. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌తో పాటు ఇంటితో పాటు మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేసారు. తొలిరోజు అర్ధరాత్రి రెండు గంటల వరకు తనిఖీ చేసిన అధికారులు.. తర్వాత రోజు ఉదయం 10 గంటలకే మళ్లీ దాడులు చేశారు.ఒక బృందం విజయవాడలో సోదాలు నిర్వహించగా, ద్వారకా తిరుమల, నిడదవోలు, భీమడోలు, దుర్గామల్లేశ్వరస్వామి ఏవో కార్యాలయంలో కొన్ని బృందాలు తనిఖీ చేశాయి. పడమట రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన ఓ లావాదేవిపై గాంధీ నగర్ ఆఫీస్‌లోనూ ఎంక్వైరీ జరిగింది. కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.రిజిస్ట్రార్ రాఘవరావు మీద ఆరోపణలు, వివాదాలు.. ఇప్పటివి కాదు. మొదటి నుంచీ ఉన్నవే. అసలు ఆయన నియామకమే పెద్ద వివాదం. పటమటకి రిజిస్ట్రార్‌గా వచ్చిన నెలరోజుల్లోనే రాఘవ రావుని ప్రభుత్వం బదిలీ చేసింది. హైకోర్టుకు వెళ్ళి మరీ పోస్టింగ్ ఆదేశాలు తెచ్చుకున్నారు. కొన్ని రోజులపాటు మరో రిజిస్ట్రార్‌తో పాటు పక్కనే చైర్ వేసుకుని విధులు నిర్వర్తించారు. అప్పట్లో రిజిస్ట్రేషన్ శాఖలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం తనిఖీలతో మరోసారి రాఘవరావు తెరపైకి వచ్చారు.మరోవైపు దుర్గ గుడి సూపరిండెంట్‌గా ఉన్న నగేష్ ఇంటితో పాటు బంధువుల ఇళ్ళపైనా ఏసీబీ దాడి చేసింది. నగేష్ ద్వారకాతిరుమలలో విధులు నిర్వహించినపుడు భారీగా అవకతవకలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఎంక్వైరీ చేసేందుకు ఏలూరు నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. నగేష్ ఇంటితో పాటు బంధువుల ఇళ్ళపై తనిఖీలు చేసి.. భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.నగేష్ ఇంట్లో 17.91 లక్షల నగదుతో పాటు 2,210 గ్రాముల బంగారం, ద్వారకా తిరుమలలో G+4 ఇల్లు, తాడేపల్లి గూడెంలో ఇల్లు, జంగారెడ్డిగూడెంలో ఇల్లు, నిడదవోలో ఇంటి ఫ్లాట్, నిడదవోలులో ఇల్లు, ఒక కారు, రెండు రెండు యాక్టివా స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. దుర్గగుడి సూపరిడెంటెంట్ వాసా నగేష్ నుండి భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.గతంలో ద్వారకా తిరుమల ఈఓగా ఉన్న సుబ్బారెడ్డి.. నగేష్‌పై ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం ట్రాన్స్‌పర్ అయి దుర్గ గుడికి వచ్చారు. ఇక్కడ కూడా అదే బాగోతం. ఇంద్రకీలాద్రిలోనూ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత నెలలోనే నగేష్‌కి కీలక బాధ్యతలు ఇవ్వడంపై.. ఈఓకి ఫిర్యాదు చేసింది దుర్గగుడి పాలకమండలి. లడ్డూ ప్రసాదం, క్యూ లైన్లు, అంతరాలయం వంటి కీలక స్థానాల్లో నగేష్‌కు బాధ్యతలపై పాలక మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు కూడా నగేష్‌పై ఫిర్యాదులు వచ్చాయని ఈఓ దృష్టికి తీసుకువెళ్లింది పాలక మండలి. జీఎస్‌టీలో అవకతవకలు చేసి రూ.18 లక్షలు కాజేశారని ప్రధాన ఆరోపణ. దాని చుట్టూ ఎంక్వైరీ చేస్తుండగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.ఇక కర్నూలులోనూ ఏసీబీ దాడులతో అలజడి మొదలైంది. డివిజనల్ కో-ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.సుజాతకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు అవినీతి నిరోధకశాఖ అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏక కాలంలో కర్నూలు నగరంలోని ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. శ్రీరామ్‌నగర్ కాలనీలో జీ ప్లస్-2, అశోక్ నగర్‌లో జీప్లస్ -1, కస్తూరి నగర్‌లో ఇళ్లు, బుధవారపేటలో మూడు షాప్‌లు, కర్నూలు చుట్టుపక్కల 8 ఇళ్ల స్థలాలు, రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి, 40 తులాల బంగారంతో పాటు కీలక పత్రాలను గుర్తించారు. వాటి లెక్కలు తేల్చే పనిలో పడ్డారు అధికారులు.