Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఐదేళ్లలో సాధించిన ప్రగతి..బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన వెల్లడి..!

ఐదేళ్లలో సాధించిన ప్రగతి..బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన వెల్లడి..!

అమరావతి:అసెంబ్లీలో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వరుసగా ఐదోసారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టడంతో పాటు కేంద్రం నుంచి సాధించిన నిధుల వరకూ ప్రతీ అంశంపైనా ఆయన ఉదాహరణలు, గణాంకాలతో వివరణ ఇచ్చారు. ఇందులో 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా, 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% నికి పెరగటం వలన 4వ స్థానానికి చేరుకున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం ‘అగ్రస్థానం’ అందుకుందన్నారు. 2018-19 సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా, ఇవాళ 13 శాతం వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి, ఏకైక రాష్ట్రం ఏపీయేనని ఆర్ధిక మంత్రి బుగ్గన తెలిపారు. 13 లక్షల 6 వేల మంది రైతులకు సేవలను అందిస్తూ, మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయన్నారు. ఇథియోపియా, బంగ్లాదేశ్, వియత్నాం ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు ‘విత్తనం నుండి అమ్మకం వరకు’ అందిస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాలలో అనుసరిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ నీటిపారుదల పధ్ధతి అమలులో రాష్ట్రం రెండో స్దానంలో ఉందని, అంతే కాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాలలో, 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.సి.ఏ.ఆర్.) జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును ఏపీ గెల్చుకుందన్నారు. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా, ఇవాళ లక్షా 67 వేల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతిని చేస్తున్నామన్నారు. అలాగే చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో, మొత్తం సముద్ర ఆహార ఎగుమతులలో 31 శాతంతో దేశంలోనే ముందంజలో ఉందన్నారు. 2023లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకుగాను, వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు అందుకున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మనదే అన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చటం, ఇంధనం, మౌలిక సదుపాయాల వినియోగం అంశాలకుగాను ఏపీ 15వ ఎనర్షియా అవార్డు-2023 క్రింద మూడు అవార్డులను అందుకుందన్నారు. అలాగే 2014-15 రెవిన్యూ లోటు గ్రాంటు క్రింద రూ.10,460 కోట్లు కేంద్రం నుంచి విడుదల చేయించినట్లు బుగ్గన తెలిపారు. ఏపీ పౌరసరఫరాల సంస్థకు సంబంధించి ఏపీ-తెలంగాణా రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుండి రావలసిన రూ.1050 కోట్ల రూపాయల గ్రాంటును రాబట్టగలిగామన్నారు. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా రూ.30,497 కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగామన్నారు. అలుపెరగని పోరాటం ద్వారా పోలవరం ప్రాజెక్టు నవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు.జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ మూడో స్దానంలో ఉందన్నారు. కొత్త సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా.. 2023 సంవత్సరంలో ఇవి 7లక్షల 20 వేలకు పెరిగాయన్నారు.దేశంలో 5 శాతం వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి పరంగా రాష్ట్రం ఏడో స్థానంలో ఉందన్నారు. మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, లారస్ సింథసిస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, యోకహామా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గ్రీన్ కో ఎనర్జీ వంటి దిగ్గజ పరిశ్రమలు నాలుగేళ్లలో రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయన్నారు.2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల జాబితాలో రాష్ట్రం మూడో స్థానాన్ని పొందిందన్నారు. విశాఖ పట్టణంలోని రుషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్ గా ‘బ్లూ ఫ్లాగ్’ లేబుల్ను పొందిందన్నారు.2023 సంవత్సరానికిగాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article