కదిరి:పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 4వ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో 22 మంది హరీష్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. వారిలో అబ్బాయిల కరాటే కతాస్ విభాగంలో 10 గోల్డ్ మెడల్స్, ఐదు సిల్వర్ మెడల్స్ సాధించగా, అమ్మాయిల కథాస్ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్, రెండు బ్రౌన్జ్ మెడల్స్ సాధించారు. శనివారం హరీష్ పాఠశాలలో పతకాలు సాధించిన విద్యార్థులతో అభినంద సభ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ యం.యస్. కిరణ్ చేతుల మీదుగా వారికి ధ్రువీకరణ పత్రాలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని, అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. అలాగే విద్యార్థులు సెల్ ఫోన్లకు, టీవీలకు ఎక్కువ శాతం అలవాటు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, ఆ అలవాటు తగ్గించుకొని చదువుపై దృష్టి సారించాలన్నారు. క్రీడలవల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికొల్లాసం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు కరాటే ఆత్మ రక్షణగా ఉంటుందని చెప్పారు. శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ అక్బర్ అలీని ప్రిన్సిపాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఖాదర్ భాషా, ప్రసన్న కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.