ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహావన్ ప్రాంతంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీద ఓ బస్సు.. ఓ కారును ఢీకొట్టింది. ఆ వెంటనే రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో.. మంటల్లో చిక్కుకుపోయిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఇంకొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి.
మథురాలోని మహావన్ ప్రాంతంలో ఉన్న యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం జరిగింది ఈ ఘటన. 40 ప్రయాణికులతో కూడిన ఓ బస్సు బిహార్ నుంచి దిల్లీకి వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత.. ఆ బస్సు డివైడర్ని తాకిందని, అనంతరం ఓ కారును ఢీకొట్టిందని సమచారం. బస్సు.. కారును ఢీకొట్టిన వెంటనే.. రెండు వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి. కాగా.. బస్సులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. కానీ కారులో ఉన్న ఐదుగురు.. సమయానికి బయటకు రాలేకపోయారు. ఫలితంగా.. వారందరు అగ్నికి ఆహుతైపోయారు.