అన్నిరంగాల్లో విఫలమైన జగన్ ప్రభుత్వం వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడంలో కూడా ఘోరంగా విఫలమైంది :గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అమరావతి:గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలు, అసత్యాల మయమని నిరసిస్తూ శానససభ, శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరంటీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. “గవర్నర్ ప్రసంగం మొత్తం ఒక నిస్సారమైన, నిస్తేజమైన పాలకుల విధానాలకు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నంగా సాగింది. ఒక గోబెల్స్ ప్రచారాన్ని తలపించింది. పాలనలో అన్ని విధాలా విఫలమైన ప్రభుత్వం, అంకెల గారడీ చేసి, గవర్నర్ ప్రసంగం ద్వారా లేనిదాన్ని ఉన్నట్టుగా భూతద్దంలో చూపే ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నిరంగాల్లో ఫెయిల్యూర్సే. రాష్ట్ట్రాన్ని అప్పుల మయం చేసి, అప్పుల్లో దేశంలోనే నంబర్ – 1 గా నిలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు ముఖ్యమైన గవర్నర్ ప్రసంగంలో పోలవరం, రాజధాని అంశాల్లో జరిగినమోసం, రైతులు.. నిరుద్యోగులు.. యువతకు చేసిన దగా, దళితులు, బడుగు, బలహీనవర్గాలకు అందించే రాయితీల్లో చేసిన దగా లాంటి కీలకాంశాలు లేవు. కేంద్రప్రభుత్వం అందించే పథకాలకు జగనన్న, వైఎస్సార్ అని పేర్లు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. విద్య, వైద్య రంగ ప్రమా ణాలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలో దోపిడీ పెరిగింది..ధరలు పెరిగాయి. 98శాతం హామీలు నెరవేర్చాను.. 175 స్థానాల్లో గెలిపించండి అనే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదు గవర్నర్ ప్రసంగంలో గతప్రభుత్వ పథకాల పేర్లు మార్చి, అంకెలు అటూఇటూ మార్చి చెప్పారుప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని ఈ ముఖ్యమంత్రి నెరవేర్చ లేదు. 98శాతం హామీలు చేశాను.. 175 స్థానాల్లో గెలిపించండి అనే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో వాస్తవాలన్నీ గవర్నర్ కు కూడా తెలుసు. ఈ ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్ర పరువు ప్రతిష్టలు గంగలో కలిశాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు దాడులు పెరిగిపోయాయి. ఎటుచూసినా శాంతి భద్రతలు మచ్చుకైనా లేవు. నీటిపారుదల రంగం కునారిల్లిపోయింది. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో అమలైన పథకాల పేర్లుమార్చి, వాటికే అటూ ఇటూ అంకెలు మార్చి చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్రం సర్వనాశనమైంది. గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఆయనతో అలా చెప్పించింది. వాళ్లు ఇచ్చింది గవర్నర్ చదివారు. ఇచ్చింది చదవలేక నాలుగుసార్లు మంచినీళ్లు తాగారు. గవర్నర్ తోనే నీళ్లు తాగించిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసర మా? నోటొకొచ్చినట్టు హామీలిచ్చి నవరత్నాలుగా మార్చి, 98శాతం అన్నీ అమలు చేశానంటే ఎవరు నమ్మేది? ఈ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది అనేది కాదనలేని వాస్తవం.” అని బుచ్చయ్య చౌదరి తేల్చిచెప్పారు.