ఏఐటియూసి జిల్లా అధ్యక్షుడు జీ.వేణుగోపాల్
వేంపల్లె
కార్మికుల హక్కులపై ఈనెల 16న గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని ఏఐటియూసి జిల్లా అధ్యక్షుడు జీ.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జీటి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సన్నాహా సమావేశం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బల్లారపు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీ.వేణుగోపాల్ మాట్లాడుతూ కార్మికులు, రైతులకు బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. స్వామినాథన్ సిఫార్సు మేరకు రైతులు పండించే పంటలకు పెట్టుబడికి 50 శాతం కలిసి మద్దతు ధర చట్టం చేయాలని కోరారు. అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి, కార్మికులందరికీ కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల, ఉపాధిహామీ పథకం 200 రోజులకు పెంచడం, కనీస వేతనం రోజుకు రూ. 600 చెల్లించాలని కోరారు. వివిధ సంఘాలు ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కెసి.బాదుల్లా, జిల్లానేత పి.చంద్రశేఖర్, సిపిఐ కార్యదర్శి వెంకటరాములు, భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు బాలాజీ, శీను, చలపతి, ఆశావర్కర్ల నాయకులు సునంద, శోభారాణి, మమత, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.