ప్రజల నీరాజనాలతో 2వ రోజు బొర్రంపాలెం, ఎన్టీరాజాపురం, మల్లేపల్లి గ్రామాలలో చైతన్య రథం పై ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట:గత ఐదేళ్లుగా అసమర్ధ, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాల రాజ్యంలో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సార్వత్రిక ఎన్నికల రూపంలో మే 13వ తేదీన ఒక సువర్ణావకాశం రానున్నదని, దానిని రాష్ట్రం లోని ప్రజలు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలు, యువత సద్వినియోగం చేసుకుని తమ పవిత్రమైన, విలువైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించి వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించాలని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలంలో 2వ రోజు చైతన్య రథం పై బొర్రంపాలెం, ఎన్టీరాజపురం, మల్లేపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజల నీరాజనాలతో మహిళలు బ్రహ్మానందం పడుతూ మంగళ హారతులు పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ పర్యటన ముందుకు సాగింది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు చేకూరే లబ్దిని వివరించారు. ఈ సంధర్బంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ ను ఎంతో అభివృద్ధి చేశారని, రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతున్న సమయంలో 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ మాయమాటలు, బూటక పు హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తన అవినీతి, అసమర్ధపాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. యువత ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు లేక రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి మత్తులో పడి నాశనం అయిపోయారన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించడంతో మహిళలు ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలకు గురవుతున్నారని ఆందోళన వెలుబుచ్చారు. రాష్ట్రం అప్పుల మయం అయిందని, మాఫియా ముఠాలకు అడ్డాగా మారిందని, మరలా ఆంధ్ర రాష్ట్రానికి పూర్వపు విలువలు రావాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.