జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
సహజత్వాన్ని ప్రతిబింబించేందుకు.. అందమైన ఊహకు చక్కని రూపమిచ్చే కళారూపం చిత్రలేఖనాన్ని ప్రోత్సహించేందుకు, విద్యార్థుల్లో దాగున్న చిత్రలేఖ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్, ఆర్ట్ మేట్, చిత్రం ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే చిత్రకళా ప్రపూర్ణ శ్రీ నడిపల్లి సంజీవరావు స్మారక చిత్రలేఖనం పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశమందిరంలో కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్‌కుమార్, డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వరరావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్రలేఖనం ఔన్నత్యం గురించి చాటిచెబుతూ ఆ కళపట్ల విద్యార్థుల్లో ఆసక్తి, అభిరుచిని పెంపొందించేందుకు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదికలు కృషిచేస్తున్నాయని.. ఎప్పటికప్పుడు పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఈ పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్ జూనియర్స్ (1-3 తరగతులు), జూనియర్స్ (4-6 తరగతులు), సీనియర్స్ (7-9 తరగతులు), సూపర్ సీనియర్స్ (ఇంటర్, డిగ్రీ) నాలుగు విభాగాల్లో ఈ నెల 19న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో చిత్రకళా ప్రపూర్ణ శ్రీ నడిపల్లి సంజీవరావు స్మారక చిత్రలేఖనం పోటీలు జరగనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 17వ తేదీలోగా 9347950085 (వాట్సాప్), forumforartistsvja@gmail.com ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. 40 మంది విద్యార్థుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలతో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని
డా. నడిపల్లి రవికుమార్, రజని చౌదరి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కో కన్వీనర్ గిరిధర్ అరసవల్లి, కార్యక్రమ సమన్వయకర్త స్ఫూర్తి శ్రీనివాస్, చిత్రం ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ చిత్రం సుధీర్, మహిళా విభాగపు కన్వీనర్ సంధ్యారాణి అరసవల్లి, జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు