కొండా రాజేశ్వరరావు
సీనియర్ జర్నలిస్టు
ఉమ్మడి కృష్ణాజిల్లా వణుకూరు జగనన్న కాలనీలో వెక్కిరిస్తున్న వీఎంసీ లేఅవుట్ లు
వెలగని వీధిదీపాలతో రాజ్యమేలుతున్న కటిక చీకటి
అడ్రసులేని తాగునీటి సౌకర్యం
డ్రైనేజీలు లేవు మురుగు పోయే దారీలేదు
అధికారుల అలక్ష్యం.. ప్రజాప్రతినిధుల పంతం
రాష్టంలోని చాలా చోట్లా జగనన్న కాలనీలకు బాలరిష్టాల దశ అధికమించే సమయం కనుచూపు మేరలో కానరావడం లేదు. కేవలం అధికారిక లెక్కల్లో జగనన్న కాలనీలు అద్భుతం.. అమోఘం అంటూ అధికారులు గొప్పలు చెప్పడమే తప్ప వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ల నిర్మాణానికి సుమారు 15 లక్షల మందికి పైగా ఇళ్లు నిర్మించుకునేందుకు తొలిదశగా కేటాయించారు. దశల వారిగా ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రుణ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధుల అలక్ష్యం కారణంగా పేదవాడి సొంతింటికల కలగానే మిగిలిపోనుంది. నిత్యతోరణం పచ్చదనంతో కళకళలాడాల్సిన కాలనీలు అనాథగానే మిగిలి పోతున్నాయి జగనన్నా అని భోరున విలపిస్తున్నాయి. బీపీఎల్ కింద పేదలకు సెంటు, సెంటున్నర భూమి కల్పించాలనే ధృఢ సంకల్పంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హత ఉన్న నిరుపేదలందరికీ భూమి కేటాయించింది. ప్రతి ఒక్క పేదవాడి జీవితకాల వాంఛ నెరవేరాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ “జగనన్న గూడు” పేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. నెలకు వేలాది రూపాయలు ఇంటికి బాడుగ కట్టుకోలేని నిరుపేదలకు జగన్ అన్న కేటాయించిన భూములలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామని అనుకున్నప్పటికీ అందుకు అధికారులనుండి తగిన స్పందన లేకపోవడం వణుకూరు జగనన్న కాలనీ వీఎంసీ లేఅవుట్ లో ఎక్కడి పనులు అక్కడే తిష్టవేసుకుని కూర్చున్నాయి. అమ్మమీద ఆన అభివృద్ధి అనేది అంగుళంకూడా దాటలేదంటే ఇక్కడ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో అవగతం అవుతుంది. వణుకూరు జగనన్న కాలనీ వీమ్ సీ లే అవుట్ కు సంబంధించిన మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయి. ఇక వెలగని వీధి దీపాలు, కానరాని నీటి సౌకర్యం, మురుగుపోయే దారి లేక వెక్కిరిస్తున్న డ్రెయినేజీ వ్యవస్థ వెరసి నన్ను చూడు నా అందం చూడు అంటూ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నా కనీస స్పందనలేని అధికారుల చర్యలపై ప్రజానీకం మండిపడుతున్నారు. కాలనీలోని రోడ్లపరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉంది. అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ అన్ని వసతులు సమృద్ధిగా అయిపోయినట్టే చూపిస్తుంది. కానీ కాలనీకి వచ్చి చూస్తే మాత్రం అస్తిపంజరంగా దర్శనం ఇస్తుంది. ప్రభుత్వం కడుతున్న ఇళ్లు స్లాబ్ దశ దాటనంటూ వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల పనితనంపై నమ్మకం లేని చాలామంది లబ్ధిదారులు లక్షలాది రూపాయలు అప్పు చేసి తమకు కేటాయించిన సెంటు భూమిలోనే అద్భుత కట్టడాలు చేసుకున్నప్పటికీ కనీస వసతులైన రోడ్లు, వీధిదీపాలు, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇక్కడ కాపురం ఉండటానికి భయపడిపోతున్నారు. గాఢాంధకారమైన చీకటిలో ఒకపక్క బ్లేడు బ్యాచ్, మరోపక్క దారి దోపిడీ దొంగల భయం వీరిని మరింత భయపెట్టిస్తోంది. ప్రధానంగా వీధిలైట్లు లేకపోవడం ఒక అనాథగానే మిగిలిపోతూ ఇక్కడికి రావడానికి ఎవరూ సాహసించడంలేదు. కొందరు గృహప్రవేశాలు చేసుకుని ఒకటి రెండు రోజుల అనంతరం వెనుతిరిగిన వాస్తవాలు ఆకాలనీలో అసంపూర్తిగా మిగిలిన రోడ్లను పలకరిస్తే సాక్ష్యం చెప్పేందుకు వెనకడుగు వేసే పరిస్థితి లేదనేది వాస్తవం. దీనికి నిదర్శనం వణుకూరు జగనన్న కాలనీలోని వీఎంసీ లేఅవుట్ అనే అంటున్నారు లబ్ధిదారులు. కాలనీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇక్కడ ఎదురవుతున్న సమస్యలను అధికారులు దృష్టిలో పెట్టినప్పటికీ వాటిని వారు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు మృగ్యమయ్యాయి. దాంతో కొందరు లబ్ధిదారులు స్పందన కార్యక్రమాలలో కూడా ఫిర్యాదులు చేసిన దాఖలాలు సుస్పష్టంగా ఉన్నాయి. సమస్యలపై అధికారుల “స్పందన” ఏమాత్రం కానరాకపోవడం ఆ స్పందన లక్ష్యం కూడా ప్రభుత్వ చర్యలను వెక్కిరిస్తున్నాయి. అయినా వారికి ఏమాత్రం చీమకుట్టిన స్పందన లేకపోవడం ఒకింత దురదృష్టకరమైన ఘటనగానే లబ్ధిదారులు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరపాలక సంస్థలో తూర్పు నియోజకవర్గంలోని పేదలకు, సెంట్రల్ నియోజకవర్గంలోని కొందరికి పెనమలూరు మండలం వణుకూరులోని జగనన్న కాలనీలో లేఅవుట్లో సుమారు 6వేలమందికి స్థలాలు కేటాయించారు. సుమారు నాలుగు వేల వరకు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొందరు గవర్నమెంట్ ఆప్షన్లో ఇళ్లు నిర్మించుకుంటుంటే, మరికొందరు వారే సొంతంగా ఇళ్లు కట్టుకుంటున్నారు. వీటిలో చాలా వరకు సొంతంగా కట్టుకుంటున్నవారి ఇళ్లు పూర్తయ్యాయి. రంగులతో ఇళ్లను అందంగా తీర్చిదిద్దుకున్నారు. కొందరు ఈ ఇళ్లల్లోకి వచ్చినా, మరికొందరు భయంతో ఉడాయించారు. పూర్తయిన వాటిలో చాలా ఇళ్లకు తాళాలు కనబడుతున్నాయి. దీనిపై ఆరా తీస్తే.. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో రావడం లేదని తెలుస్తోంది. మరింత సమాచారం సేకరించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోడ్లు అధ్వానం.. కాలనీలో వీధి దీపాలు లేకపోవడం, కొంత భాగంలో వీధి దీపాలు ఉన్నా వెలగక పోవడం, నీటి సౌకర్యం, డ్రెయినేజీ వసతులు వంటివి లేకపోవడమే కారణమని తెలిస్తోంది.
రోడ్లు అధ్వానం
వీఎంసీ లేఅవుట్‌కు రావాలంటే వణుకూరు మీదుగా ప్రయాణించాలంటే వణుకూరు, మద్దూరు రోడ్డు ఘోరాతి ఘోరం. వర్షం వస్తే అడుగుతీసి అడుగువేయలేం. అగాధాలతో, రాళ్లు మొనలు తేలి కనిపిస్తోంది. టూ వీలర్ మీద రావాలన్నా భయమే ఎప్పుడు ఎక్కడ టైర్లు పంక్చరై బండిని నెట్టు కెళ్లాల్సి వస్తుందోనని. ఇక ఈ రోడ్డుపై ఫ్యామిలీతో ప్రయాణం ఒక నరకమే తలపిస్తుంది. ఇన్ని కష్టాలు దాటి కాలనీలోకి ప్రవేశిస్తే అక్కడి రోడ్లు పరమచెత్తగా ఉన్నాయి. గోతులతో పాటు వాన కురిస్తే బురదకయ్యలా మారుతున్నాయి. వాహనాలైతే బురదలో ఇరుక్కుపోవడంతో ఇక్కడ నివసిస్తున్న వారిలో చాలామంది వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
వీధి దీపాలు లేవి..?
ఏదైనా ప్రాతం నివాస యోగ్యంగా ఉండాలంటే ముందుగా వీధిలైట్లు ఎంత అవసరమో అందరికీ అవగతమే. ఊరికి దూరంగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో కూడా ముందుగా వీధిలైట్లు వేసిన తరువాతే అపార్ట్మెంట్స్ కడతారు. అలాంటిది ఇక్కడ
వీఎంసీ లేఅవుట్ ప్రారంభం నుంచి వీధి దీపాలే లేవు.
దీనిపై విద్యుత్ పనులు చేసే కాంట్రాక్టర్ కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. లేఅవుట్ సగం నుంచి ఉన్నా అవి వెలగవు. వణుకూరు, మద్దూరు రోడ్డులో అసలు వీధి దీపమే లేదు. రాత్రి అయితే చిమ్మచీకటి. ఇవన్నీ దాటి కాలనీలోకి వచ్చినా అదే పరిస్థితి. వీధి దీపాలు లేకపోవడంతో అక్కడున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలోకి కొందరు మద్యం తీసుకొచ్చి విక్రయిస్తు న్నారని అందువల్ల రాత్రివేళ బయటకు రాలేకపోతు న్నామని అక్కడ స్థానికంగా నివసిస్తున్న మహిళలు వాపోతున్నారు.
మంచినీటి సౌకర్యం లేదు మురుగు పోయే దారీలేదు
జగనన్న కాలనీలోకి వచ్చి కొంతమంది నివసిస్తున్నా.. వారికి మంచినీటి వసతి లేకపోడంతో నానా అవస్థ పడుతున్నారు. ఇక్కడ నీటి సౌకర్యం లేదని ఎలా రాగలమని పలువురు వాపోతున్నారు. అలాగే వాడుక నీరు పోయే దారి లేక పక్కనున్న ఖాళీ స్థలాల్లోకి వదులుతున్నారు. ముఖ్యమంత్రి సదాశయంతో స్థలిమిచ్చి తాము ఇళ్లు నిర్మించు కున్నా అధికారుల సహకారం కరువయ్యిందని బోరున విలపిస్తున్నారు. వసతుల కల్పనలో అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
శాఖల మధ్య సమన్వయ లోపం స్థానికులకు శాపం
వణుకూరు జగనన్న వీఎంసీ లేఅవుట్లోని స్థానికులు రాత్రి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయండి మహాప్రభో అని అధికారులు చుట్టూ తిరుగుతున్నా రేపుమాపు అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. తీరా దీనిపై నిలదీస్తే పంచాయతీ, వీఎంసీ అధికారులు మాకు సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. పోనీ పంచాయతీ అధికారులనైనా బతిమాలుదా మనుకుంటే కరెంట్ ఇచ్చే అవకాశం తమ పరిధిలో ఉన్నా వీధి దీపాల ఏర్పాటుకు కావల్సిన సామగ్రి కార్పొరేషన్ నుంచే రావాలని, వారు ఇస్తే వీధి దీపాలు వెలిగించడానికి అభ్యంతరం లేదని చెబుతున్నారు. అయితే సామగ్రి పంపిణీ చేయాల్సిన కార్పొరేషన్ మాత్రం ఇప్పటికే తాము అన్ని హక్కులు పంచాయతీకి ఇచ్చేశామని తమ పరిధిలో ఏదీ లేదని కార్పొరేషన్‌లోని ముఖ్య అధికారి వ్యాఖ్యానించారు. ఏతావాతా రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇళ్ల లబ్ధిదారుల ఆశ అడియాశతో ఇక్కట్లే మిగులుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్క దిద్దాల్సిన ప్రజాప్రతినిధులు తమ బినామీలతో టెండర్లు వేయించి చోద్యం చూస్తూ, ఓట్ల వేటలో మునిగి తేలుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఓట్ల రాజకీయ వ్యవహారాలు చూస్తుంటే సీఎం జగన్ తను అనుకున్న లక్ష్యం ఇప్పట్లో సాధ్యం కాదనే అనిపిస్తుంది. ఈ విధంగా ప్రజా ప్రతినిధులు పంతానికి పోతూ.. అధికారులు అలక్ష్యంగా ఉంటే ఇక జగనన్న ఆశలు,ఆశయాలు ఎలా నెరవేరతాయో ఒక్కసారి అవగతం చేసుకుంటే మంచిది. జగన్న కాలనీలపై సీఎం ఎప్పకప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ అంతా బ్రహ్మాండం అని చెబుతూ సీఎం దృష్టిని సైతం పక్కదారి పట్టిస్తున్నారనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. కేవలం కాగితాలపై లెక్కల్లో తప్పించి వాస్తవ పరిస్థితులలో అవి మృగ్యంగానే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం.