ప్రపంచకప్-2024 టైటిల్ ఫైట్‍లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఫైనల్ వరకు అజేయంగా దూసుకొచ్చిన యంగ్ టీమిండియా.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. గతేడాది భారత్ సీనియర్ టీమ్ కూడా వన్డే ప్రపంచకప్‍లో ఫైనల్‍లో అడుగుపెట్టగా.. ఆస్ట్రేలియానే దెబ్బకొట్టింది. ఇప్పుడు భారత అండర్-19 జట్టును కూడా ఆసీస్ యువ జట్టు తుదిపోరులో దెబ్బ తీసింది. దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‍లో భారత్ 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్‍గా ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టిన భారత్.. రన్నరప్‍తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనల్‍లో చతికిలపడిన భారత్‍కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ సాధించింది.
ఆదర్శ్ సింగ్ 47, హైదరాబాద్ ఆటగాడు మురుగన్ అభిషేక్ 42, ముషీర్ ఖాన్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. టోర్నీలో పరుగుల వర్షం కురిపించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9), అర్షిన్ కులకర్ణి (3) కీలకమైన ఫైనల్లో విఫలం కావడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రియాన్షు మోలియా 9 పరుగులు చేయగా, హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరవెల్లి అవనీశ్ రావు (0) డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3, రాఫ్ మెక్ మిలన్ 3, కల్లమ్ విల్డర్ 2, చార్లీ ఆండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు.