కెవిపిఎస్ జిల్లా కమిటీ
కొవ్వూరు నియోజక వర్గం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు బొంతా మహేంద్ర గ్రామ వైసీపీవర్గ విభేదాలు వివాదంతో మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కెవిపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.గురువారం కెవిపిఎస్ జిల్లా కమిటీ తరపున ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల విజయ్ కుమార్, కె.క్రాంతి బాబు ఒక ప్రకటన విడుదల చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో దొమ్మేరు గ్రామంలో దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్య వైసీపీ చేసిన హత్యే అన్నారు. వైసీపీ గ్రూపు తగాదాలకు దళిత యువకుడిని బలిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాంటి ఎఫ్.ఐ.ఆర్. లేకుండా రోజు పాటు పోలీస్ స్టేషన్లో నిర్భందించడమేంటన్నారు. పోలీసుల తీరు వైసీపీ పార్టీ కార్యకర్తల్లా ఉందన్నారు. పోలీసులు రోజంతా పోలీస్ స్టేషన్ లో నిర్భందించటంతో భయంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అరెస్టు అయిన మహెంద్రను విడుదల చేయించాలని మహేంద్ర కుటుంబ సభ్యులు హోం మంత్రికి తెలిపినా కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ఘటనకు రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒక దళిత యువకుడి మృతి ఘటనకు వైసిపి పార్టీ, పోలీసులు కారణమయితే కెవిపిఎస్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు ను అక్రమంగా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు. దళిత యువకుడుని ఈ వర్గపోరులో దళిత యువకుడు బలికావటం బాధాకరమని అన్నారు. మొత్తం జరిగిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుచేసి మహేంద్ర ఆత్మహత్య కు ప్రేరేపించిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చిన్న ప్లెక్సీ వివాదాన్ని ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దళిత యువకుడని అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మృతికి కారణమైన పోలీసులపై, వారికి అండగా నిలిచిన వైసీపీ గ్రూపు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్, క్రాంతి బాబు డిమాండ్ చేశారు. మహేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మహేంద్ర కుటుంబానికి న్యాయం చెయ్యకపోతే అవసరమైతే కెవిపిఎస్ ఆధ్వర్యంలో అన్ని దళిత, ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.