స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు కదిరి వైసిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారం ఇటు ఎమ్మెల్యే అటు ఎమ్మెల్యే అభ్యర్థి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో కార్యకర్తలు
నల్లచెరువు :నల్లచెరువు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం తారస్థాయికి చేరింది. మండల కేంద్రం నల్లచెరువులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అసమ్మెతితో అయోమయంలో పడినట్లు మండలంలో చర్చ మొదలైంది.ఒకే పార్టీలో ఇరు వర్గాల కారణంగా కార్యకర్తలు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో పడినట్లు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు గుసగుసలు మొదలయ్యాయి.ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆ వర్గం నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.కదిరి ఇన్చార్జిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ ను అధిష్టానం ప్రకటించినప్పటి నుంచి ఆయన వర్గీయులు,ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వర్గీయులు ఎవరికి వారే అన్నట్లుగా తమ తమ కార్యక్రమాలను జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో కార్యకర్తలు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో పడినట్టు మండల వ్యాప్తంగా చర్చలు వినిపిస్తున్నాయి.ఇదే క్రమంలో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ మండల పరిధిలోని బాలేపల్లి తండా, పూలకుంటపల్లి, పోలేవాండ్లపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.అదే రోజు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన భవనాల ప్రారంభోత్స కార్యక్రమాన్ని నిర్వహించారు.ఒకే పార్టీలో ఇద్దరు నాయకులు వేరువేరు కార్యక్రమాలలో పాల్గొనడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.కార్యకర్తలు సైతం ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోయారని చర్చ సాగుతోంది.ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సైతం ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే వర్గీయులు మండల ఎంపీపీ, ఎంపీటీసీలు, మరి కొంత మంది సర్పంచులు కూడా హాజరు కాలేదు.ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ బలోపేతానికి ఇరువర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది.కానీ ఇరు వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తమ తమ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే ఉండగానే వైసిపి అధిష్టానం కదిరి నియోజకవర్గం ఇన్చార్జిగా బిఎస్ మక్బూల్ అహ్మద్‌ను నియమించింది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు కాస్త తారా స్థాయికి చేరాయి. చివరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరి మధ్య మంతనాలు జరిపారు.అయినప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదనీ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.దీంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నిండుకున్నట్లు తెలుస్తోంది.ఇరు వర్గాలు కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన సమయంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తుండడం పార్టీకి నష్టం చేకూర్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కలుపుకోకుండా పోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాయకుల మధ్య ఎన్ని ఉన్నా ఎన్నికల సమయంలో ఇరువర్గాలు కలసి పార్టీ బలోపేతానికి పనిచేయాల్సిన అవసరం ఉంది.మరి అధిష్టానం ఈ విషయంపై ఏ విధంగా స్పందించి ఇరు వర్గాలను కలిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందో వేచి చూడాల్సిందే.