అమరావతి:ఏపీలో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో తమ హాల్టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు, ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్ళవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ సూచించింది.
పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి: మంత్రి బొత్స
మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలతోపాటు పదో తరగతి, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పది, ఇంటర్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఏపీలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ మార్చి 18 నుంచి 31 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గం. వరకు పదోతరగతి పరీక్షలు నిర్ణయించారు. ఈసారి పదోతరగతి విద్యార్థులకు 7 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. పరీక్షల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.