- వందలాది కుటుంబాలు టిడిపి నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
- సిఎం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శం
- కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
వేంపల్లె
పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమాభివృధ్ధికీ కృషి చేస్తున్న సారధి సిఎం జగన్ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎస్సీ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వందలాది కుటుంబాలు జడ్పీటీసీ ఎమ్.రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ కె.చంద్రఓబుల్ రెడ్డి, జేసిఎస్ కన్వీనర్ ఆర్.శ్రీనివాసులు, ఎంపిపి ఎన్.లక్ష్మిగాయిత్రీల సమక్షంలో ఎస్సీ మండల కన్వీనర్ ఎన్. జయరాములు, వార్డు సభ్యుడు షామీర్ ఆధ్వర్యంలో టిడిపి నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆ కుటుంబాలు మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వంలో అనేక హమీలను ప్రకటించి వాటి అమలును విస్మరించారని, వైకాపా ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన హామీలే కాకుండా చెప్పని అనేక హమీలను సిఎం జగన్ పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం ఎంపి అవినాష్ మాట్లాడుతూ పేద, మధ్య, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సిఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గత పాలక ప్రభుత్వాలు పేదల సంక్షేమ పట్ల నిర్లక్ష్యం వహించి..వారిని అట్టడుగుస్థాయికి దిగజార్చాయని, కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చిత్తశుద్ధితో వారి సంక్షేమాభివృధ్ధికీ శ్రీకారం చుట్టిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక బలోపేతానికి కృషి చేసిందన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేసేందుకు అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసి, వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి పేదవాడి కుటుంబం ఉన్నత చదువు చదివేందుకు అవకాశం కల్పించిందన్నారు. నాడు-నేడు పథకం ద్వారా కార్పొరేట్ తరహా పాఠశాలలు మెరుగుపడ్డాయని..మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీ, ఇంగ్లీషు మీడియం, బైజూస్ ట్యాబులు, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద తదితర విద్య సంక్షేమ పథకాలతో విద్యకు మొదటి ప్రాధాన్యత కల్పించిందన్నారు. ప్రతి గ్రామీణ విద్యార్థి ఉన్నత చదువులు చదివేందుకు జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. వైద్యం కోసం దూరప్రాంతాలకు వెళ్లకుండా సమీప గ్రామాల్లోనే వైద్య సేవలు అందేలా వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే ఆడుదాం-ఆంధ్ర క్రీడలతో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి చేసిందన్నారు. ఇవే కాకుండా ఆసరా, చేయూత, డ్వాక్రా రుణాలు, సున్నావడ్డీ, చేదోడు, పాలవెల్లువ వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా పాలన అందిస్తున్నట్లు వివరించారు. మనందరం సిఎం జగన్ ను ఆశీర్వదించి తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.