ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. డూప్లికేట్ దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు నెంబర్ లేకుండా కొన్ని దరఖాస్తులు రావటంతో… అన్నింటిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు.
ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 5 గ్యారంటీలకు 1,09,01,255 దరఖాస్తులు నమోదైనట్లు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. జనవరి 12వ తేదీ నాటికే రికార్డు టైమ్ లో డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు డేటా బేస్ ద్వారా గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు ఉన్నట్లు తేల్చారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా కూడా కొన్ని దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అసలైన అర్హులు నష్టపోకుండా వీటిని మరోసారి పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా. డి. జె. పాండియన్ గురువారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. నదిని సంరక్షిస్తూ, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. అలాగే మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు.