జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు
- కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)-2024లో భాగంగా జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్న నేపథ్యంలో ఫామ్-6, 7, 8లను ప్రణాళికాయుతంగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ముకేష్ కుమార్ మీనా.. వెలగపూడి సచివాలయం నుంచి ఎస్ఎస్ఆర్-2024పై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎలక్టోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ డిల్లీరావు.. జిల్లాకు సంబంధించిన ఎస్ఎస్ఆర్ కార్యకలాపాల ప్రగతిని సీఈవోకు వివరించారు. నవంబర్ 15 నాటికి చూస్తే 23,474 ఫామ్-6లు, 28,394 ఫామ్-7లు, 40,604 ఫామ్-8లు అందుబాటులో ఉన్నాయని.. వీటిని మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2, 3 తేదీలను ప్రత్యేక ప్రచార రోజులుగా గుర్తించి 2024, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ కొత్తగా ఓటు పొందేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని.. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి చూస్తే ఇప్పటివరకు జిల్లాస్థాయిలో 11 సమావేశాలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం 77 సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను డిసెంబర్ 26 నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించి, ఆపై జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రదర్శనకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వరరావు, ఈఆర్‌వోలు, ఎన్నికల సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.