లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో ఆదివారం రాత్రి శివపార్వతుల పూల పల్లకి ఉత్సవం భక్తజన సందోహం మధ్యన అంగరంగవైభవంగా జరిగింది. రాత్రి పది గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి ఊరేగింపుగా ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకి వాహనంపైకి తీసుకువచ్చారు. వీరభద్రాలయ ధర్మకర్తల మండల చైర్మన్ రమానందన్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూల పల్లకి ఉత్సవం ముందుకు సాగింది. పూల పల్లకి ఆలయ ప్రధాన రహదారి ,రాజా వీధి ,జాతీయ రహదారి మీదుగా కంచి సముద్రం రహదారి నుండి రాజ వీధి గుండా ఆలయానికి చేరుకుంది. పూల పల్లకి ముందు కీలుగుర్రాల నృత్యం అందరినీ అలరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందూపురం రూరల్ సీఐ ఈరన్న, లేపాక్షి ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా లేపాక్షి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన చెక్కల భజన కార్యక్రమం భక్తులను పర్యాటకులను ఆకర్షించింది. ఈ పూల పల్లకి ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది తరలి వచ్చారు.