Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుమహిళా రక్షణలో తెలంగాణ టాప్ ..!

మహిళా రక్షణలో తెలంగాణ టాప్ ..!

మహిళల భద్రత, రక్షణకు తెలంగాణ సీఎంగా కేసీఆర్ భాద్యతలు తీసుకున్న తర్వాత సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు, చట్టాలను కఠినంగా అమలు చేసే విషయంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళ భద్రత, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా ”ఉమెన్ సేప్టీ వింగ్”ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాడులు, అకృత్యాలు జరిగితే రక్షించే ప్రత్యేక వ్యవస్థ ఒకటి ఉందన్న ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా భద్రతా విభాగం కింద… షీ టీమ్స్, భరోసా, షీ సైబర్ ల్యాబ్ ఉపవిభాగాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు చెందిన అధికారులు తెలంగాణలో మానవ అక్రమ రవాణా నివారణతో పాటు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కోసం కళ్యాణలక్ష్మి, షాధిముభారక్, వితంతు పించన్, మానవీయకోణంలో జీవనభృతిగా ఒంటరి మహిళకు పెన్షన్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను కూడా ప్రభుత్వం పెంచింది. తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది… పిల్లలు బాగుంటే భావి భారతం బాగుంటుందన్న ఆకాంక్షతో తల్లీ, బిడ్డ సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేనివిధంగా మన రాష్ట్రంలో పథకాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతి మహిళకు ఎలాంటి ఆపద వచ్చిన 100,112 మహిళా మిత్ర 1090,1091కి ఫోన్ చేసి సహాయం పొందే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సమాజంలో మహిళ అనగానే ఆటవస్తువుగా ఉపయోగపడుతుందనే చులకన భావం ఉంది. రాజకీయాల్ని ఒక వృత్తిగా స్వీకరించి సేవా దృక్పథంతో వస్తే గౌరవం దొరకడంలేదు. రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల కాలం నుండి నిలబడిన మహిళల శాతం ఎంతమంది ఉన్నారు? నిత్యం విమర్శలతో, ఒడిదుడుకులను మింగి, తిమింగిలంలను తట్టుకొని నిలబడిన వారు కూడా అతి కొద్ది మంది మాత్రమే. చాలా మంది వచ్చిన నిలదొక్కుకోక వెళ్ళిపోయారు. నామినేటెడ్ పదవుల్లో ఆయా రాజకీయ పార్టీల హోదాలలో సైతం మహిళలు కానరావడం లేదు. సమాజంలో మేము సగం.. మాకు సగం అని గొంతు చించుకుని గోడు చెప్పుకుంటున్నా పాలక పక్షాలు పట్టించుకోవడం లేదు. మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా.. ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. పుట్టక ముందే భ్రూణ హత్యలు.. పుట్టిన తర్వాత వివక్షలు.. మగువల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. ఆడ పిల్ల అంటేనే ఆర్థిక గుదిబండగా భావిస్తున్నారు..అప్పుడే తమకు జరిగిన అన్యాయం గురించి గట్టిగా అడగగలుగుతారు. గొంతు విప్పి గర్జించగల్గుతారు. అన్నీ మారుతున్నా.. మహిళల పట్ల మన ఆలోచనా ధోరణి మారడంలేదు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది.సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం.. అన్నింటా సగం.. అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల సంబరాలు అంగరంగ వైభంగా జరుపుకుంటున్నాం. విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ.. ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. ‘మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’ అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ.. మహిళల హక్కుల అవగాహన కోసం ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది.

భారతదేశంలో అనాదిగా స్త్రీ అవమానాలకు,చిత్రహింసలకు,దోపిడీకి బలవుతున్న సంఘటనలు కోకొల్లలు. స్వాతంత్ర్యానంతరం మం సమాజంలో స్త్రీకి అనుకూలంగా అనేక చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. స్త్రీలలో విద్యావ్యాప్తి,క్రమంగా ఆర్థిక స్వేచ్ఛ సాధించి సాధికారిత దిశగా పయనిస్తున్నప్పటి నుంచి స్త్రీలు నిత్యం హింసకు గురవుతున్నారు. స్త్రీలు శారీరక హింసలకు, అపహరణలకు, మానభంగాలు సజీవ దహనాలకు, హత్యలకు బలవుతున్నారు.సాంకేతికత, నాగరికత ఎంత విస్తరించినా మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు వేధింపులు తగ్గడంలేదు. బడి నుంచి గుడి వరకు ఇంటి నుంచి అఫీస్ వరకు అతివలకు భద్రతా ప్రశ్నార్థకంగా మారింది. నారీమణులకు రక్షణగా వివిధ చట్టాలు రూపొందించినా, అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. వివాహం అయినా తరువాత ఏడూ సంవత్సరాలలోపు వివాహిత ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులు ఆమె భర్తను లేదా అతని బంధువులను కారణంగా భావించాలి. దేశంలో కఠిన చట్టాలున్నప్పటికీ ,వరకట్న హత్య, వరకట్న వేధింపుల కింద నిందితులైన అనేక మందికి సరైన సాక్ష్యాల పేరుతో శిక్ష పడకుండా న్యాయదేవత కాపాడుతుందనే విమర్శ ఉంది.తప్పతాగి ఆఖరుకు కన్న తండ్రి కూడా కాలయముడై కాటేస్తుంటే స్త్రీకి సమాజంలో రక్షణ ఎక్కడిది? అందుకే వారి కోసం ప్రత్యేక చట్టాలు పుట్టాయి. ఏ చట్టం ఏం చెబుతుందో ఏ సందర్భంలో ఎలాంటి చట్టం వర్తిస్తుందో ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సామాజిక దురాచారాలపై మహిళలపై జరుగుతున్నా వేధింపులపై పోరాటం చేయడానికి జనబాహుళ్యాన్ని, మేధావులను స్వచ్చంద సంస్థలు సమాయత్త పర్చాల్సిన అవసరం ఉంది.నిత్యం స్త్రీల పై దాడులు ,వివక్షను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి మహిళలు న్యాయం పొందవచ్చు.

బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్.. తల్లి సంరక్షణ కోసం న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారు. మహిళా ఆధారిత అనేక పథకాలు మరియు కార్యక్రమాలతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురుషులు-మహిళల నిష్పత్తిని సమతుల్యం చేయడంలో మంచి ఫలితాలను పొందింది మరియు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దేశంలో ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఇదే.మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా సాధికారత సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలల్లో కూడా ఇతోధికంగా ఉండాలని బావించి ఒక అడుగు ముందుకేసి గ్రేటర్ హైదారాబాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లుగా, డిప్యూటి మేయర్లుగా ఊహించని విదంగా ఇద్దరు మహిళలకు పట్టంకట్టి కేసీఆర్ చిత్తశుద్దిని చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం ప్రత్యేక సెలవు ప్రకటించింది.మహిళలపై దాడులు జరుగకుండా ‘షీ’టీమ్స్ ను ఏర్పాటు చేసి ఆకతాయిల బెడద నుండి విముక్తి కల్పించి స్వయంశక్తితో ఎదగాలని మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించ‌డానికి సర్కార్ వి’హబ్’ ను ఏర్పాటుచేసింది. వ్యాపార అభివృద్దికి ఎలాంటి తనఖాలు లేకుండా స్త్రీ నిధి ద్వారా ఒక లక్ష పైగా ఋణాలు ఇచ్చి ఆర్థిక స్వాలంబనతో పాటు, మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ది చెందాలని సీఎం కేసీఆర్ బావించారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు వారి హక్కులను పరిరక్షించేందుకు గడచిన దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా బంధువుగా పేరొందింది.ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ వల్ల నేరస్తుల,ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

(దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 12వ రోజు ‘ మహిళా సంక్షేమం ’)

డా.సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్, సెల్-9866255355

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article