Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుమోచా' వచ్చేస్తోంది..!

మోచా’ వచ్చేస్తోంది..!

అన్నదాతలపై మరో పిడుగు
పొంచివున్న తుఫాను ముప్పు

ప్రజాభూమిప్రతినిధి,హైదరాబాద్‌ః

ఇప్పటికే అకాల వర్షాలతో అన్నదాత కంటతడి పెడుతుంటే.. మరో పిడుగు లాంటి వార్త రైతులను మరింత భయపెడుతోంది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనుందంటూ ఐఎండీ వార్నింగ్‌ ఇచ్చింది.తుఫాన్‌ ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉంది. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో వచ్చే 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 6వ తేదీ నాటికి తుఫాన్‌గా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావం ఒడిశా, ఏపీపై తీవ్రంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఒడిశా, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.తుపాను ఏర్పడితే దానికి మోచాగా పేరు పెట్టనున్నారు. గత సంవత్సరం ఇదే మే నెలలో అసాని తుపాను బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. అయితే రాగల 48 గంటల్లో ఏపీ వాతావరణంలో భారీ మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.పల్నాడు జిల్లాల్లో భారీ వర్షానికి కళ్లాల్లో వున్న వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది.కోతకు సిద్ధంగా ఉన్న వరి, కోసి ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసిపోయాయి. పొలాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. పట్టాలు కప్పినా భారీ వర్షానికి నీరు నిలిచి పట్టాలలోంచి మిరప, మొక్కజొన్న తడిసిపోయింది. ఇక పొలాల్లో మొక్కజొన్న, మిర్చి, జొన్న పంటలను ఎండబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పలు చోట్ల కల్లాలో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్నపై రైతులు ముందస్తుగా పట్టాలు కప్పి ఉంచినా కొన్ని చోట్ల గాలులకు పట్టాలు ఎగిరిపోయి పంటలు తడిసిపోయాయి. దీంతో ప్రభుత్వమే తడిచిన పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తమిళనాడులోనూ భారీ వర్షాలు..

తమిళనాడులో వర్షబీభత్సం సృష్టించింది. 11 జిల్లాల్లో వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నైలో ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు చెరువులుగా మారాయి. నడుముల్లోతు చేరిన వరదనీటిలో ప్రయాణం నరకయాతనగా మారింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల భారీ వృక్షాలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావొద్దని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article