Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుయోగా గురు రామ్‌దేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

యోగా గురు రామ్‌దేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ:‌ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో పతంజలి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రాందేవ్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. తమ ఉత్పత్తులతో కొన్ని వ్యాధులు నయమౌతాయంటూ పతంజలి సంస్థ జారీ చేసిన ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటీషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం..ఆధునిక అల్లోపతి వైద్య విధానం, వైద్యుల్ని కించపర్చే పతంజలి ఉత్పత్తుల్ని, వ్యాపార ప్రకటనల్ని నిలిపివేయాలని ఆదేశించింది. పతంజలి సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుుకునే మార్గాలు కనిపెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. గతంలో కూడా పతంజలి సంస్థకు సుప్రీంకోర్టు హెచ్చరించిన పరిస్థితి ఉంది.తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించడంతో ఇవాళ బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు క్షమాపణలు కోరారు. కోర్టు ఆదేశించింది ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ సుప్రీంకోర్టు ఆచార్య రాందేవ్, బాలకృష్ణల క్షమాపణల్ని తోసిపుచ్చింది. కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు న్యాయస్థానం మందలించింది. మీ క్షమాపణలకు సంతృప్తి చెందడం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మరోసారి కోర్టుకు హాజరుకావల్సి ఉంటుందని తెలిపింది. కోర్టు తీసుకునే చర్యలు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాల్సిందేనని తెలిపింది. ఏప్రిల్ 10వ తేదీన మరోసారి హాజరుకావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ అమానుల్లా స్పష్టం చేశారు. పతంజలి చేసే ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని చోద్యం చూస్తోందంటూ మండిపడ్డారు. గతంలో కోర్టు ఆదేశించినా అదే ప్రకటనలు ఇచ్చారంటే మీకెంత ధైర్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వత ఉపశమనం అని ప్రకటనల్లో ఇవ్వడమంటే వ్యాధిని పూర్తిగా నయం చేస్తారా అని ప్రశ్నించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article