వివేకా హత్య కేసులో జగన్ పాత్ర పై విచారణ జరపాలి టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి
కడప అర్బన్:రాజకీయ లబ్ధి కోసమే జగన్ ముఠా వైఎస్ వివేకానంద రెడ్డిని హతమార్చిందని టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ద్వారకా నగర్ లోని ఆయన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ గొడ్డలిపోటుతోనే బాబాయ్ చనిపోయాడని, అంత ఖచ్చితంగా జగన్ ఎలా చెప్పగలిగారని ఆయన ప్రశ్నించారు. సిబిఐ విచారణ కోరిన జగన్, సీఎంగా సిబిఐ విచారణ పిటిషన్ను ఎందుకు వెనక్కు తీసుకున్నారని ఆయన అనుమానాన్ని వ్యక్తపరిచారు. బాబాయిని చంపిన అబ్బాయిని జగన్ రెడ్డి రక్షించడం వెనుక ఆంతర్యం ఏమిటని, అంతా తెలిసిన జగన్,ఎందుకు దాస్తున్నారని అన్నారు. జగన్ సీఎం కాగానే కేసు విచారణ లో పురోగతి ఎందుకు ఆగిపోయిందన్నారు. తండ్రికి న్యాయం చేయాలని కూతురు పోరాడుతుంటే, సి.బి.ఐ తమ్ముడిని అరెస్టు చేయకుండా జగన్ అడ్డుపడ్డారని అన్నారు. హై ప్రో ఫైల్ కేసులో కూడా ఇంత జాప్యానికి జగన్ రెడ్డి కారణమని, సునీతమ్మ చెప్పారని అన్నారు. కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయడానికి వస్తే, ఉద్రిక్త వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలే అని తేల్చి చెప్పారు. సునీత అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. సీఎం గా కొనసాగే అందుకు జగన్కు కనీస అర్హత లేదని, ఆడబిడ్డకు న్యాయం చేయలేని ఆయన రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను లాంటి, సోది డైలాగులు చెప్పడం ఇకనైనా వైసీపీ నేతలు ఆపాలని అన్నారు. వివేక హత్యలో జగన్ పాత్ర పై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు, వివేకాను చంపిన వారిని వదిలిపెడితే, మంచికి, చెడుకు అర్థం లేకుండా పోతుందని, వంచన, కుట్రలు, కుతంత్రాలు చేసే పార్టీకి, అభివృద్ధి, సంక్షేమం చేసే పార్టీకి మధ్య జరిగే ఎన్నికల యుద్ధంలో తెలుగుదేశం గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కడప టిడిపి అసెంబ్లీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి మాట్లాడుతూ తండ్రిని చంపిన నరహంతకులకు శిక్ష పడే అందుకు, సునీత చేస్తున్న న్యాయ పోరాటంలో టిడిపి అండగా నిలుస్తుందని, ఐదు కోట్ల మంది పార్టీలకు అతీతంగా ఆమెకు మద్దతు ఇవ్వాలన్నారు. మాన, ధన, ప్రాణాలకు రక్షణ ఉండాలంటే కచ్చితంగా, వైఎస్ సునీత చెప్పినట్లు,రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఓటుతో జగన్ రెడ్డిని ఓడించాలని ఆమె కోరారు.