ప్రజాభూమి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆశించిన దాని కంటే నియోజకవర్గం మెరుగైన ప్రగతిని సాధిస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ కండ్రిక జంక్షన్ వద్ద 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 9 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డులో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి సోమవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 14 వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, వీఎంసీ జనరల్ ఫండ్స్.. ఇలా పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజావసరాలను తీరుస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఇందులో భాగంగా రూ. 5 కోట్లతో పైపుల రోడ్డు జంక్షన్ నుంచి జక్కంపూడి జంక్షన్ వరకు 5.3 కి.మీ. మేర బీటీ రోడ్డుతో పాటు.. రూ. 4 కోట్లతో కండ్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు 4.2 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్లే వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో.. రహదారి నిర్మాణంతో వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ. 2.50 కోట్ల నిధులతో చేపట్టిన విజయవాడ – నూజివీడు రహదారి నియోజకవర్గానికే మణిహారంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో ఈ ప్రాంతంలో కనీసం ఒక చిన్న రోడ్డు వేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్ లో రూ. 12 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ.. రహదారులను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలియజేశారు. మరోవైపు రూ.3.50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కి.మీ. మేర చేపట్టిన రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ (ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఈ మాధవ్, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఇస్మాయిల్, జిల్లేళ్ల శివ, పందిరి వాసు, అలంపూర్ విజయ్, ఉమ్మడి వెంకట్రావు, ఉద్ధంటి సురేష్, చెక్కా నరసింహరావు, బోరా బుజ్జి, రామిరెడ్డి, జి.వెంకటేశ్వరమ్మ, టి.తులసమ్మ, వై.అనిల్, తదితరులు పాల్గొన్నారు.