అన్నమయ్య జిల్లా పీలేరులో ‘రా కదలిరా’ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… ప్రజాకోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని అన్నారు. పీలేరు జన గర్జన రాష్ట్రం అంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. వచ్చేది యుద్ధం..ఆ యుద్దానికి మేము సిద్ధంగా ఉన్నామని..రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని, అందులో గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు అన్నారు.
ఇవాళ భీమిలిలో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్ డీ చేశారని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన విధానం అని ..ఇలాంటి జలగ మనకెందుకు?… మరోసారి చెబుతున్నా… వై నాట్ పులివెందుల? అంటూ చంద్రబాబు సమరోత్సాహం ప్రకటించారు.
‘‘నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉన్నది రాయలసీమ రక్తం. రాయలసీమను రతనాల సీమ చేయాలంటే ఏం చేయాలో అన్ని ఆలోచన చేశాను. హంద్రీనివాపై మేము రూ.4200 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ ఒక రూపాయి కూడా పెట్టలేదు. పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదు. గాలేరు నగిరిపై రూ.1550 కోట్లు మేము ఖర్చు పెట్టాం’’ అని చంద్రబాబు వెల్లడించారు.
జగన్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని.. జగన్‌ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర ముగిసిపోతుందని అన్నారు.
రాష్ట్రానికి జగనన్న జలగండం పట్టుకుందని చంద్రబాబు సెటైర్ వేశారు. ఇసుక దొంగలు పెరిగిపోయారు.. . నదుల్లో ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు ఇసుక బంగారమైపోయింది. రాయలసీమ రతనాల సీమ కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల కష్టాలు తీరాలంటే టీడీపీ, జనసేన అధికారంలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.