తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా, వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణాను అప్పులపాలు చేసిందని, ఈ కారణంగానే తాము ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతుందని చెప్పారు.
మంగళవారం గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఇందులో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీప్ దాస్ మున్షీ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చించారు.
ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇతర హామీలను నెరవేర్చామని, మిగిలిన వాటిని నిర్ణీత గడువు లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని చెప్పారు. హమీల అమలుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడివుండే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.