- రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు చేపట్టాలి.
– ఆరుతడి పంటలకు రాయితీపై విత్తనాలు అందిస్తాం.
– జిల్లా కలెక్టర్లు ఎస్.డిల్లీరావు, పి.రాజబాబు.
వర్షాభావ పరిస్థితులు, రిజిర్వాయర్లలో నీటి లభ్యత లేకపోవడం, తాగునీటి అవసరాలు దృష్ట్యా కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల్లో రబీ పంటకు నీరు అందించే పరిస్థితి లేనందున.. ప్రత్యామ్నాయంగా రైతులు ఆరుతడి పంటలు చేపట్టాలని.. ఇందుకు అవసరమైన విత్తనాలను రాయితీపై రైతులకు అందిస్తామని జిల్లా కలెక్టర్లు ఎస్.డిల్లీరావు, పి.రాజబాబులు తెలిపారు.
కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల నీటిపారుదల, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు శనివారం నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఉభయ జిల్లాల కలెక్టర్లు, కమిటీ ఛైర్మన్లు అయిన ఎస్.డిల్లీరావు. పి.రాజబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన సహాయ సహకారాలపై పూర్తిస్థాయిలో చర్చించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కృష్ణానదీ ఎగువ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినట్లు లేనందున ఎగువ ప్రాంతం నుంచి దిగువకు సాగునీటిని విడుదలచేసే అవకాశం లేదన్నారు. నాగార్జున సాగర్‌లో కేవలం 26 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలున్నాయని.. ఇందులో 5 టీఎంసీలు కుడి, ఎడమ కాలువల ద్వారా తాగునీటి అవసరాలకు ఉపయోగించాల్సి ఉందన్నారు. పైనుంచి నీరు వచ్చే పరిస్థితి లేనందున రైతులు రానున్న రబీ పంటలను చేపట్టవద్దని సూచించారు. ఎక్కువగా నీరు అవసరమయ్యే వరి, చెరుకు, అరటి తదితర పంటలు చేపట్టినట్లయితే సకాలంలో నీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంటుందన్నారు. ఈ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన పెసర, మినుము, కంది, మిర్చి తదితర పంటలను చేపట్టాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సకాలంలో వర్షాలు పడనందున విపత్తు నిర్వహణ శాఖ ద్వారా సెప్టెంబర్ 30 వరకు ఉన్న వర్షపాతం, పంట పరిస్థితుల ఆధారంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా తిరువూరు, గంపలగూడెం మండలాలను కరవు మండలాలుగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా అక్టోబర్ 1 నుంచి వర్షపాతం, పంట పరిస్థితుల ఆధారంగా విస్సన్నపేట, ఎ.కొండూరు, నందిగామ, వీర్లపాడు, రెడ్డిగూడెం, పెనుగంచిప్రోలు, జి.కొండూరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ అధికారులు గణాంకాలను తీసుకొని.. రైతులకు పంట బీమాను అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు వివరించారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా పరిధిలో 13.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని.. ఇందులో 6.79 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు. కృష్ణా తూర్పు డెల్టాలోని ప్రధాన కాలువలైన బందరుకాలువ, కేఈబీ కెనాల్, ఏలూరు కెనాల్, రైవస్ కెనాళ్ల ద్వారా రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. రబీ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కృష్ణా వాటర్ బోర్డు ఆమోదించిన విధంగా కృష్ణా డెల్టాకు 151.20 టీఎంసీలు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత లేనందున.. ఆమోదించిన నీరు విడుదల చేయలేకపోతున్నామన్నారు. ఇప్పటి వరకు పులిచింతల ప్రాజెక్టులో 44.50 టీఎంసీలు, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 36.09 టీఎంసీలు, పులిచింతల ఉపనదుల ద్వారా 20.73 టీఎంసీలతో కలిపి మొత్తం 101.32 టీఎంసీలను ఇప్పటివరకు వినియోగించడం జరిగిందన్నారు. ఈ నెల 17 నాటికి పులిచింత ప్రాజెక్టులో 13.66 టీఎంసీలు మాత్రమే నీరు ఉండటం వల్ల రీబీకి నీటిని విడుదల చేయడం కష్టమన్నారు. కృష్ణా జిల్లాలో ప్రధాన కాలువల పూడికతీత పనులను సకాలంలో చేపట్టినట్లయితే చిట్టచివరి భూమి వరకూ సాగునీరు అందించేందుకు అవకాశముంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాలువల ద్వారా కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేయడం జరుగుతుందని.. తాగునీటి అవసరాలు మినహా ఇతర అవసరాలకు నీటిని మళ్లిస్తే చర్యలు తప్పవన్నారు. రబీకి ప్రత్యామ్నయాంగా రైతులు చేపట్టే ప్రత్యమ్నాయ ఆరుతడి పంటలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ బుడమేరు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుడమేరుపై ప్రతిపాదించిన వంతెనల పనులకు కొత్త అంచనాలు తయారుచేసి టెండర్లు పిలిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లిఫ్ట్‌లకు సంబంధించి కొత్త మోటార్ల ఏర్పాటుకు చర్యలు, ప్రస్తుతం ఉన్న పంట చివరి వరకు నీరు అందించడం, కాలువలకు నీరు రాకముందే చేపట్టాల్సిన పూడికతీత పనులు, పంట నష్ట పరిహారం, చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు నిల్వకు అవసరమైన పనులు చేపట్టడం తదితర అంశాలను నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌టీఆర్ జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ డి.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కొంత వరకు పంట నష్టం జరిగిందని.. దీనిపై సమగ్ర సర్వే నిర్వహించి బీమా మొత్తం అందేలా సమష్టి కృషితో చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వరి దిగుబడులు కూడా బాగా తగ్గే పరిస్థితి ఉందన్నారు. దిగుబడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల అభివృద్ధికి కూడా ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
సమావేశంలో ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నీటిపారుదల సర్కిల్ పర్యేవేక్షక ఇంజినీర్ టీజీహెచ్ ప్రసాద్‌బాబు, ఈఈ కృష్ణారావు, ఎన్‌టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.నాగమణెమ్మ, కృష్ణాజిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, కృష్ణా, ఎన్ టీ ఆర్ జిల్లాల వ్యవసాయ అధికారులు మనిధర్, జ్యోతి రమణి, స్వర్ణలత, అనితా భాను, వెంకటేశ్వరరావు, కెనడీ, ఊర్మిళ.. మార్క్ ఫెడ్ డీఎం నాగమల్లిక, ఉద్యాన అధికారులు బాలాజీ కుమార్, సుభానీ, ఏపీ సీడ్స్ అధికారి శ్రీనివాసరావు, మార్కెటింగ్ అధికారులు కిషోర్, మంగమ్మ, సలహా మండళ్ల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.