విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్.
విజయవాడ
విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేయాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ అన్నారు.విజయవాడ లయోలా కళాశాలలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన 11వ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, శాసన మండలి సభ్యులు కెఎస్.లక్ష్మణరావులు ప్రారంభించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మట్లాడుతూ విద్యార్థుల్లో దాగియున్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు చేయడం ద్వారా గుర్తింపు పొందేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ అభివృద్ధి అనేది ఎదో ఒక మంచి ఆలోచన నుంచి ఉద్భవిస్తుందన్నారు. విద్యార్థులు సృజనాత్మకతమైన ఆలోచనల ద్వారా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యున్నతమైన ప్రతిభను కనబరిచి ఆవిష్కరణలను రూపొందించి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. అధునాతన టెక్నాలజీని విద్యార్థులు ఉపయోగించుకునేలా ప్రభుత్వం పయోగశాలలను ఆధునికీకరించి అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని మరింత పెంచుకుని నూతన ఆవిష్కరణల ద్వారా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడంపై అధ్యాపకులు దృష్టిపెట్టాలని శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ కోరారు.శాసన మండలి సభ్యులు కెఎస్. లక్ష్మణ్ రావు మాట్లాడుతూ సృజనాత్మక నైపుణ్యం, శాస్త్రీయ దృక్పథంతో శాస్త్ర సాంకేతిక, వైద్యరంగాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే కొత్త కొత్త ఆలోచనలతో రీసెర్చ్ చేసి గొప్ప ఫలితాల ద్వారా ప్రపంచంలోనే దేశ ప్రతిష్టతను అగ్రభాగాన నిలిపారన్నారు. వారి స్ఫూర్తితో ఇన్నోవేటెడ్ రీసెర్చ్ చేసేలా విద్యార్థులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పై ఆసక్తిని పెంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.
సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 120 పైగా ఆవిష్కరణలను ప్రదర్శించారు. వీటిలో ఉత్తమ ఆవిష్కరణలను రూపొందించిన విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేయడం జరుగుతుందని విద్యా శాఖ ఉప సంచాలకులు కె.వి.ఎన్.కుమార్ తెలిపారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎ.శైలజారెడ్డి, లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్, జిల్లాసైన్స్ అధికారి హుసేన్, జిల్లాకు చెందిన మండల విద్యా శాఖ అధికారులు యం.వీరస్వామి, విజయరామారావు, సోమశేఖర నాయక్, ఎ.సూరిబాబు, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.