బీజేపీపై ధ్వజం..ముందస్తుగా సీపీఐ, అనుబంధ సంఘాల నాయకుల అరెస్టు
- విశాఖ ఉక్కును కాపాడుకోవడంలో చేతకాని దద్దమ్మలా సీఎం జగన్..
- సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్
- కేపీ.కుమార్, ప్రత్యేక ప్రతినిధి, ప్రజాభూమి, అనంతపురం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ, ఏఐటీయూసీ, అనుబంధ సంఘాల నాయకులు కన్నెర్ర చేశారు. బుధవారం నగర శివార్లలోని తపోవనం సర్కిల్ జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు మంగళవారం పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం రాస్తారోకో చేపట్టినసీపీఐ, ఏఐటీయూసీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలను పొలీసులు అరెస్టు చేశారు. వీరికి మద్దతుగా రాస్తారోకో కార్యక్రమానికి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ను కూడా అరెస్టు చేశారు. ముందస్తుగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, నగర కార్యదర్శి శ్రీ రాములు, ఇతర నాయకులను తెల్లవారు జామునే వారి ఇళ్ళవద్దకు వెళ్ళిపోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూరాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని రాస్తారోకో, నిరసన కార్యక్రమాలకు వెళ్తున్న ఆయా పార్టీల నాయకులను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ 32 మంది కార్మికుల బలిదానాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు తెగనమ్ముకుంటోందని విమర్శించారు. అందులో భాగంగానే లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని విరుచుకు పడ్డారు. విశాఖ ఉక్కును కాపాడుకోడానికి రెండు సంవత్సరాలుగా బాధితులు నిరసనలు ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలు, 31 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగాలను, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తనపై ఉన్న కేసుల భయంతో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లడమే పనిగా పెట్టుకున్నాడని గజమెత్తారు. అదానీ డొల్ల కంపెనీల వ్యవహారాన్ని అమెరికా పరిశోధన సంస్థ బట్టబయలు చేసి నివేదిక సమర్పించిన అనంతరం, గౌతమ్ అదానీ గుట్టు రట్టయిందని ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే అదానీ రూ.లక్షల కోట్లు గడించాడని ఘాటుగా విమర్శించారు. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఉభయ సభల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నా, ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా అదానీపై మాట్లాడటం లేదని విమర్శించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి అదానీకి విశాఖ, అనంతపురం జిల్లాల్లో భూములు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం రూ.30 వేల కోట్లకే ప్రధాని మోదీ తన స్నేహితుడు అదానీకి తెగనమ్ముతుంటే, సీఎం ఆ ప్రక్రియను ఆపకపోగా.. చేతకాని దద్దమ్మలా నోరుమెదపడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు వెనుకాడబోమని, పోలీసుల లాఠీలకు భయపడే ప్రసక్తే లేదని జాఫర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు ఎల్లుట్ల నారాయణ స్వామి, చాంద్ బాషా, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుల్లాయి స్వామి, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ప్రభాకర్, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.