పాముదుర్తి నుంచి కర్నూలుకు వెళ్లి బాలింతకు ప్రభుత్వ సాయం అందజేసిన వాలంటీర్
అనంతపురము
సాటి మనిషికి తన పరిధిలో సేవ చేయాలన్న తపన, సాయపడాలన్న మానవత్వం ఉండాలే గానీ, అలాంటి వారిని ఏ సరిహద్దులూ ఆపలేవు. కొందరు విధి నిర్వహణలో గిరి తీసుకుని కూర్చోవడం వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులకు అందని సంఘటనలు కోకొల్లలు. అందుకు భిన్నంగా తన విధి నిర్వహణలో సేవా దృక్పథం, మానవత్వంతో వ్యవహరించారు శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామానికి చెందిన సచివాలయ వాలంటీర్ చుక్కలూరు నరేంద్ర. ఓ లబ్ధిదారురాలి ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందిని గుర్తించి స్పందించారు. ఏకంగా సొంత జిల్లా నుంచి రెండు జిల్లాల సరిహద్దులు దాటి వెళ్లి తన పరిధిలోని లబ్ధిదారురాలికి ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని అందించారు. పాముదుర్తి గ్రామానికి చెందిన
కురుబ ఆదినారాయణ కుమార్తె సీ.గీతాంజలి (28) బాలింత కావడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె పాక్షికంగా వికలాంగురాలు కూడా. ఈ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైన ఆమెను గత కొద్ది రోజుల క్రితం వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైయస్సార్ పింఛన్ కానుక మంజూరైంది. లబ్ధిదారురాలు కర్నూలు వెళ్లిన విషయం తెలుసుకున్న వాలంటీర్ చుక్కలూరు నరేంద్ర .. ఈ నెల 4న శ్రీసత్యసాయి జిల్లా
నుంచి అనంతపురం మీదుగా కర్నూలు చేరుకుని, నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రూ.5000 ప్రభుత్వ సాయాన్ని అందించారు. విధి నిర్వహణలో ఇతని నిబద్ధత, సాయమందించడానికి చూపిన చొరవకు లబ్ధిదారురాలు, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది నరేంద్రను అభినందించారు.