కాసేపటిలో రెండు భారీ ప్రాజెక్టులకు జగన్ శంకుస్థాపన
ప్రజాభూమి ప్రతినిధి,విశాఖపట్నంః
సాగరతీరాన మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.నేడు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెలువడింది. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఉదయం 8 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్తారు. 10 గంటలకు భోగాపురం మండలం ఎ రావివలసకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10:25 నిమిషాలకు జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు. 10:30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్‌మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ వంటివి అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉంటుంది.అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. 10:55 నిమిషాలకు సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు విశాఖపట్నానికి పర్యటనకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:40 నిమిషాలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌కు చేరుకుంటారు. అదాని డేటా సెంటర్, వైజాగ్ ఐటీ టెక్ పార్క్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. 3:50 నిమిషాలకు రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 5.30 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరి 6:45 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.