సామాన్య బీసీ కులంలో పుట్టిన వ్యక్తికి భారతరత్న పురస్కారం దక్కడం గొప్ప విషయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ శత జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. అవార్డు ప్రకటన తర్వాత ఆయన కుమారుడు రామనాథ్ ఠాకూర్ స్వయంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీసీలను పెద్దపీట వేస్తున్నామనడానికి ఈ పురస్కారమే ప్రత్యక్ష నిదర్శమని అన్నారు.
1978లో మండల కమిషన్ సిఫార్సుకు ముందే బీసీలకు రిజర్వేషన్స్ కల్పించిన నాయకుడు కర్పూరీ ఠాకూర్ అని గుర్తు చేశారు. రాంవిలాస్ పాశ్వాన్ లాంటి నాయకులు కర్పూరీ ఠాకూర్ శిష్యరికంలో పనిచేశారని తెలిపారు. బీజేపీ తెలంగాణ పార్టీ తరపున కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఓబీసీ నేత సూర్యపల్లి శ్రీనివాస్ పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.