- రూ.కోట్లు విలువైన వాటిపై అధికార పార్టీ నేతల కన్నేశారు
- టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయండి
- విచ్చలవిడిగా కమిషన్లు దోచేస్తున్నారు
- కమిషనర్ కు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకుల ఫిర్యాదు
అనంతపురము
కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలకు రక్షణ కల్పించాలని, అలాగే సామాన్యుల స్థలాలు సైతం కబ్జాకు గురవుతున్నాయని తక్షణ స్పందించి ఆ స్థలాలను కాపాడాలని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు నగరపాలక సంస్థ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. నగర పరిధిలోని మునిసిపల్
కార్పొరేషన్ స్థలాలతో పాటు అమాయక ప్రజల పూర్వపు ఆస్తులను కబ్జాదారులు యధేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా కార్పొరేషన్ కు చెందిన టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు ఆరోపించారు. మంగళవారం ఆ పార్టీ నాయకులతో కలసి నగర కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, నగరంలోని వేణుగోపాల నగర్ లో సర్వే నెంబర్ 179-1 లో రాయపాటి రంగనాయకమ్మ, నాగలింగప్పల పూర్వపు ఆస్తి సుమారు 50 సెంట్ల స్థలాన్ని అధికార పార్టీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.1985లో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మార్గ్ లో ఈ స్థలం ఉందన్నారు. అంతేకాకుండా ఆర్టీసి బస్టాండ్ కు దగ్గరలో ఉన్న 7 ఎకరాల సెంట్రల్ పార్క్ స్థలంలో 1 ఎకరా 50 సెంట్లు కబ్జాకు గురౌతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకుండా పోయిందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలు అక్రమిస్తున్నారని అనేకమార్లు దినపత్రికల్లో వెలుగు చూసినా, సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. అనేక ప్రాంతాల్లో నగర పాలక సంస్థ స్థలాలకు కంచే వేసినా కూడా కాజేస్తున్న కబ్జాదారులను
పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. శ్రీనగర్ కాలనీలోని సర్వే నెంబర్ 40-2000, 353లోని 3 సెంట్ల స్థలాన్ని అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జాకు ప్రయత్నించడంతో సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని, దీంతో అధికారులు ఆ స్థలంలో బోర్డులు నాటించారని గుర్తు చేశారు. అయితే, అదే స్థలంలో కబ్జాదారులు బోర్డులు తొలగించి ఆక్రమించారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కోట్ల రూపాయలు విలువచేసే కార్పొరేషన్ స్థలాలపై కబ్జాకోరుల కన్ను పడిందని, వాటిని కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శులు రమణ, అల్లిపీర, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆనంద్, సంతోష్ కుమార్, నాయకులు చాంద్ బాష, రజాక్, మున్నా, నాగప్ప, తదితరులు పాల్గొన్నారు.