భగినీ హస్త భోజనం
అమ్మ చేతి ముద్ద
మళ్లీ తినే భాగ్యం..
అమ్మ ప్రతిరూపంగా
ఇప్పటికీ ఉన్న సోదరి
చేతి బువ్వ..
భగినీ హస్త భోజనం..
తిని నూరేళ్ళు బాగుండాలి
బహుజనం..!.
ఇప్పటిదా..అప్పటిదా
ఈ సాంప్రదాయం..
పురాణం నీకిచ్చిన బహుమానం..
ఆధ్యాత్మికతకు ఉపమానం..
అందుకే..అందుకే..
ఈ భగినీ హస్త భోజనమే
నిరుపమానం..!
యమధర్మరాజు..
యమలోకపు చక్రవర్తి..
పాపపుణ్యాల లెక్క తేల్చే
సమవర్తి..
ఆయనకో చెల్లి..
ఇద్దరూ సూర్యుని సంతానం..
అన్నకు భోజనం
పెట్టాలన్న ఆశ..
ఎన్ని పిలుపులు చేసినా
తీరికే లేని ధర్మరాజు..
దాంతో చెల్లెమ్మకు
అంతులేని నిరాశ..
ప్రాణప్రదంగా ప్రేమించిన అన్నకేమో ప్రాణాలు హరియించే విధి..
సోదరికేమో
ఎదురుచూపుల నిశీధి..!
ఆ రోజు రానే వచ్చింది..
దీపావళి వెళ్ళింది..
ఎప్పటిలా చెల్లి నుంచి
యమునికి పిలుపు..
అన్నా అన్నానికి రా..అని..
ఈసారి రాలేనని చెప్పలేదు
యమధర్మరాజు..
వస్తానని చెప్పాడు
మరుసటి రోజు..
ఇంకేమి చెల్లికి పండగే..
అన్నకు నచ్చిన ప్రతి వంటకం
అమర్చింది మనసారా..
వడ్డించి తినిపించింది
కడుపారా..
చిన్ననాటి ముచ్చట్ల నడుమ
ఇన్నాళ్ళ దూరం మరచి..
సోదరునికి ప్రేమను పంచి..
అన్నాచెల్లెళ్ల పూర్వ అనుబంధం
ఇంకాస్త చిగురించి..!
బొజ్జ నిండా తిన్నాక
వరమివ్వక ఆగేనా సమవర్తి..
ఏం కావాలో కోరుకొమ్మని
అడిగితే చెల్లిని..
సిరులడగలేదు..
సంపదలు కోరలేదు..
తన గర్భంలో
నిండు నీరిమ్మని వినుతించలేదు..
మరి ఏం కోరిందో..??
అన్నా..
ఇదే కార్తీక శుద్ధవిదియ నాడు
సోదరి ఇంట తిన్న అన్నకు
అపమృత్యువు వద్దేవద్దు..
నరకవాసం అసలే వద్దని..
ఇదే నీ చెల్లికి
నువ్వు చెల్లించే ముద్దు..
ఆహా..ఇలాంటి కోరికే కద్దు..
అన్న యముని ఆనందానికి
లేనే లేదు హద్దు..
తథాస్తు అన్న ధర్మరాజు..
అన్నలకు అపమృత్యునాస్తి..
చెల్లెళ్ళకు శాశ్వత పుస్తి..
యముని వరం..
యమికి సంబరం..!
సరే..పురాణమే అనుకో..
సంప్రదాయమే కానీ..
సోదరీ సోదరుల బంధానికి
శాశ్వతత్వమే
ఈ భోజన తత్వం..
కొడిగడుతున్న సంబంధాలు..
ఆప్తుల నడుమ
ఆస్తుల కోసం వివాదాలు..
అలకలు..దూరాలు..
నిందలు..ఆరోపణలు..
ఇవన్నీ సమసి..
రక్తబంధం విలువ తెలిసి..
అది వీడని బంథమని..
తెగని రుణానుబంధమని
ఎరిగి..ఒకరిలో ఒకరు ఒదిగి..
మురిసేందుకు
ఈ భగినీ హస్త భోజనం
వేదికైతే..
అమ్మకు కడుపు నిండదా..
బ్రతికి ఉంటే కన్నుల పండగ..
ఏ లోకంలో ఉన్నా
ఆ కనులు చెమర్చవా..
బిడ్డలను దీవించే
అక్షతల పుష్పాలై..
ఆనందభాష్పాలై..!
సురేష్..9948546286