పిఠాపురంలో జనసేన కూటమి, వైసీపీల మధ్య పోటీ ఏకపక్షమా, రసవత్తరమా..!
గొల్లప్రోలు :జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రస్థాయిలో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కృత నిశ్చయంతో ఉండగా పవన్ విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. కాగా ఇటీవల పవన్ 4రోజులకు పైగా పిఠాపురంలో మకాం వేసినా ఆశించిన స్థాయిలో పర్యటన జరగలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అభ్యర్థి గీత మాత్రం ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ అభిమానులకు కొదవలేదు. కుల,మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలలోను పవన్ కు అభిమానులు ఉన్నారు. గత ఎన్నికలలో జనసేన అభ్యర్థి పెద్దగా ప్రచారం చేయకపోయినా 28 వేలకు పైగా ఓట్లు లభించాయి. అందువల్లే పలు సర్వేల అనంతరం పిఠాపురం తనకు సురక్షితమని పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. టిడిపి నుండి టికెట్ ఆశించిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కు మద్దతు తెలపవలసి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 రోజులపాటు పిఠాపురంలోనే ఉంటారని, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో పవన్ పర్యటిస్తారని ప్రచారం జరగడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కానీ పార్టీ నాయకులు ప్రకటించిన విధంగా పర్యటన జరగకపోవడం అభిమానులు, జనసైనికులను నిరాశకు గురి చేసింది. చేబ్రోలు బహిరంగ సభలో పవన్ ప్రసంగం అభిమానుల ఆశించిన విధంగా లేకపోవడం, ఆ మర్నాడు గొంతు సమస్య కారణంగా తిరిగి వెళ్లిపోవడం పలువురిని అయోమయానికి గురి చేసింది. ఆ తర్వాత 2 రోజుల అనంతరం తిరిగి వచ్చి పిఠాపురం లోని పాదగయ, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, పొన్నాడ లోని బషీర్ బీబీ దర్గా సందర్శించి మార్గం మద్య లో రైతులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, ఇతర వర్గాల వారితో మమేకమయ్యే ప్రయత్నం చేసి పార్టీ నాయకులలో జోష్ నింపారు. అంతలోనే అనారోగ్య సమస్య కారణంగా పవన్ మరల హైదరాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా పవన్ చుట్టూ ఉన్న బౌన్సర్ల వ్యవహార శైలిపై జన సైనికులు అభిమానులు,అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాలలో బౌన్సర్ల అత్యుత్సాహం కారణంగా మాజీ ఎమ్మెల్యే వర్మకు సైతం ఇబ్బందులు తప్పలేదు. పిఠాపురం లోనే నివాసం ఏర్పరచుకుంటానని, పిఠాపురం కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తానని ప్రకటించిన పవన్ 4 రోజుల పర్యటనలోనే ఒడిదుడుకులకు గురి కావడంతో పవన్ మాటను స్థానికులు ఎంతవరకు విశ్వసిస్తారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు వేరువేరుగా ప్రయాణం చేసిన టిడిపి,జనసేన నాయకులు యి ప్పుడు కలిసికట్టుగా ఎంతవరకు ముందుకు సాగుతారన్నది ప్రశ్నార్ధకమే. నిన్న మొన్నటి వరకు పవన్ స్థానికుడు కాదని వ్యతిరేక ప్రచారం చేసిన టిడిపి నాయకులు ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా సర్ది చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం శ్రమిస్తున్న జనసేన నాయకుల కన్నా టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ కు పవన్ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, తన గెలుపు బాధ్యత వర్మ దేనని ప్రకటించడం చాలా మంది జనసేన నాయకులకు మింగుడు పడడం లేదు. ఏది ఏమైనా నియోజకవర్గంలో అధిక శాతం మంది పవన్ వైపే మొగ్గు చూపుతున్నారని, మెజార్టీ గ్రామాలు జనసేనకు అనుకూలంగా ఉన్నా ప్రచారంలో మాత్రం జనసేన నాయకులు వెనుకబడి ఉంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కు మద్దతుగా ప్రచారం ప్రారంభించినా ఇంతవరకు జనసేన నాయకులు మాత్రం పవన్ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టకపోవడం గమనార్హమని పలువురు పేర్కొంటున్నారు.
ప్రణాళికా బద్ధంగా గీత ప్రచారం
వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాధ్ ప్రణాళికాబద్ధం గా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ప్రస్తుతం ఎంపీగా వ్యవహరిస్తున్న గీతకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సుపరిచితమే. గతంలో ఎమ్మెల్యేగా ఆమె చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయా గ్రామాలలోని నాయకులు, ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఆమెకు సానుకూల అంశాలుగా భావిస్తున్నారు. ఇప్పటికే పట్టణ గ్రామాల వారీగా నాయకులు, బూత్ కమిటీల సభ్యులతో సమావేశాలు నిర్వహించుకొని ప్రచారం చేపట్టారు. గీతకు ప్రత్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావడంతో అధిష్టానం నియోజకవర్గం పై ప్రత్యేక పోకస్ పెట్టి మండలాల వారీగా ఇన్ చార్జ్ లను నియమించింది. నియోజకవర్గ స్థాయి నాయకుల నుండి బూత్ కమిటీ సభ్యుల వరకు పార్టీ పరంగా పటిష్టమైన యంత్రాంగం ఉండడంతో ఆమెకు ప్రచారం సులభమయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకు అండగా ఉంటారని గీత భావిస్తున్నారు. గీత అభ్యర్థిత్వంపై కూడా ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నది ఆ పార్టీ నాయకుల భావన. కాగా స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ముందుకు సాగని ఏలేరు, సుద్ద గడ్డ ఆధునీకరణ పనులు, గొల్లప్రోలు, పిఠాపురం,మున్సిపాలిటీలకు ప్రకటించిన ప్రత్యేక గ్రాంటు నిధులు విడుదల కాకపోవడం గీతకు ప్రతికూల అంశాలుగా భావిస్తున్నారు. పవన్ పోటీ చేయడం వల్ల పిఠాపురానికి రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్న భావన ప్రజలలో బలంగా ఉండటం గీత విజయానికి ప్రతిబంధకమేనని పలువురు విశ్లేషిస్తున్నారు. వైసీపీ నాయకుల మధ్య అంతర్గతంగా విభేదాలు ఉండడంతో పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేస్తారా అన్నది ప్రశ్నార్ధకమేనని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైసీపీ నుండి పలువురు జనసేనలోకి జంప్ అవుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కాగా పవన్ కు ఉన్న సినీ గ్లామర్, అభిమానుల జోరును తట్టుకొని గీత నిలబడగలరా లేక అనుభవం ఉన్న నాయకురాలిగా ప్రజల మన్ననలు పొంది పవన్ కు చెక్ పెడతారా అని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.