Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఅంబేద్కర్ కొందరివాడుకాదు అందరీవాడు

అంబేద్కర్ కొందరివాడుకాదు అందరీవాడు

మీరు ఎటువైపో తేల్చుకోండి

  • వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు పిలుపు
  • రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే స్పందించరా?
  • కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలకు కార్యాచరణ సిద్దం
  • బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజా చైతన్య సదస్సులు
  • ఆగస్ట్‌ లో ప్రచారాలు.. అనంతరం భవిష్యత్‌ పోరాటాలకు శ్రీకారం
  • అనంత బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏవీ.నాగేశ్వరరావు
    ————-+——–+———————-
    కేపీ.కుమార్, ప్రత్యేక ప్రతినిధి, ప్రజాభూమి, అనంతపురం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులతో పాటు, ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు కూడా మిన్నకుండి పోవడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏవీ.నాగేశ్వరరావు
విమర్శించారు. మీరు మోదీ వైపు ఉంటారో, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వైపు నిలబడతారో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరం, గ్రామాల్లో వాడవాడల సీఐటీయూ జెండాలు ఎగుర వేశారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్‌, టవర్‌క్లాక్‌ మీదుగా కృష్ణకళా మందిరం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం సీఐటీయూ నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముర్తుజా అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏవి.నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కార్మికులు, కర్షకులు, శ్రామికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం రాబోవు రోజుల్లో ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం మే డేను జరుపుకుంటున్నారని, దేశంలో 100 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారని అన్నారు. 8 గంటల పని దినం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ వారి ఆశయాలు, స్పూర్తితో రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతామని దీక్ష బూనే రోజు మే డే అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక సంరక్షణ చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, హక్కులు హరించేలా లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చి కార్మికులను తిరిగి శ్రమ దోపిడి, వెట్టి చాకిరిలోకి నెట్టేసే విధానాలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తోందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రయివేటీకరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులు, ప్రజా స్వామ్యం, కార్మికుల హక్కులపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్య పరిచి పోరాటాలకు శ్రీకారం చడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాల పోరాట కార్యచరణ రూపొందించాయని, ఆగస్ట్‌ లో ప్రచారాన్ని నిర్వహించి, భవిష్యత్‌ పోరాటాలకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పోరాటాలు సాగుతున్నాయని, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌, అమెరికాలో ఉన్న హక్కులను నిలబెట్టుకోవడానికి పోరాటాలు చేస్తున్నారని, వారందరికి సీఐటీయూ
అభినందనలు తెలుపుతోందన్నారు. లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రజాస్వామ్యహితంగా ఏర్పడిన ప్రభుత్వాలను నిలబెట్టుకోవడం కోసం అక్కడి ప్రజలు పోరాటాలు చేస్తున్నారని, వారందరికి సంఘీభావ శుభాకాంక్షలు సీఐటీయూ తెలుపుతోందన్నారు. త్రిపురలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులపైన, వారి కార్యాలయాలపైన దాడులు చేస్తూ గుండాగిరి రాజ్యాన్ని నెలకొల్పిందని, దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎంత వివక్ష చూపినా, ఉన్నంతలోనే కేరళ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం కార్మికుల హక్కులను సంరక్షిస్తూ, వారి ప్రయోజనాలకు ఊతమిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో దేశానికి నష్టం జరుగుతోందన్నారు. కరోనా సమయంలో ముందస్తు చర్యలు చేపట్టకుండా లాక్‌డౌన్‌ విధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. రెగ్యులరైజేషన్‌ చేస్తామని హామి ఇచ్చి నిలబెట్టుకోలేదన్నారు. మున్సిపల్‌ కార్మికులు, స్కీం వర్కర్‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏజి.రాజమోహన్‌, జిల్లా కోశాధికారి గోపాల్‌, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఏటిఎం.నాగరాజు, శ్రీనివాసులు, తిరుమలేష్‌, ఎర్రిస్వామి, గురురాజు, లక్ష్మినరసమ్మ, వరలక్ష్మి, కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా అధ్యక్షులు విజరు, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కోశాధికారి జమున, అగ్రికల్చర్‌ కోఆపరేటీవ్‌ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులు, హమాలీ యూనియన్‌ నాయకులు బాబు, సుభహాన్‌, ఆటో యూనియన్‌ నాయకులు ఆది, నాగరాజు, ఆజాం, గూడ్స్‌షెడ్‌ హమాలీ యూనియన్‌ నాయకులు మసూద్‌, సులేమాన్‌, సుధాకర్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన్నిల రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article