ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు బొత్స సత్యనారాయణ,అంబటి రాంబాబు
ప్రజాభూమి:- ఆమదాలవలస
ఆముదాలవలస(పొందూరు),ఏప్రిల్ 24:శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వటం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.ఈ దిశగా చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.సోమవారం మండలం ఎరుకులపేట వద్ద గొర్లె శ్రీరాములనాయుడు మడ్డువలస రెండవ దశ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు వైసిపి పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎం ఎల్ సి లు దువ్వాడ శ్రీనివాస్,నార్తు రామారావు,మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఎం ఎల్ ఎ కిరణ్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు.శ్రీకాకుళం జిల్లాకు జలసిరులు కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను ప్రతి ఒకరు స్వాగతించాలని ఆయన కోరారు.గొర్లె శ్రీరాములు నాయుడు జలాశయం ద్వారా మొదటి దశ విస్తరణలో 27,500 ఎకరాలకు సాగునీరు లభిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.రెండో దశ విస్తరణ ద్వారా అదనంగా 12500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకోసం రూ.26.65 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలనా పరమైన ఆమోదం తెలిపిందన్నారు.50.700 కుడి ప్రధాన కాలువ మరో ఐదు కిలోమీటర్ల మేర విస్తరించడం ద్వారా,దీని పరిధి 55.700 కి మీ పెరగనుందని అన్నారు.వర్షాధారిత భూములకు అదనపు సాగుకు దీని నిర్మాణం వీలు పడే అవకాశం ఉందన్నారు.రెండవ దశ విస్తరణ పనులు ద్వారా పొందూరు మండలం లో తండ్యం, లక్ష్మీపురం, పొందూరు, రాపాక, వావిళ్ళపల్లి పేట,వి ఆర్ గూడెం, బుడ్డి కంచరాం, ధర్మపురం,కొంచాడ, తొలాపి, పిల్లల వలస,దళ్ల వలస కోటిపల్లి గ్రామాలకు ప్రయోజనం కలగనుంది అన్నారు.లావేరు మండలం లో పైడయ్యవలస కొత్త కుంకామ్,పాత కుంకుమ్, అదపాక, పెద్దకొత్తపల్లి, బుడుమూరు, పెద్ద రావు పల్లి, విజయరాంపురం గ్రామాల భూములు సస్యశ్యామలం కానున్నాయన్నారు.జి.సిగడాం మండలం లో కప్పరం, మధుపం, వాండ్రంగి గ్రామాలకు.. ఎచ్చెర్ల మండలంలో అరిణాo అక్కివలస గ్రామాలు భూములు పూర్తిస్థాయి సాగులోకి రానున్నాయి అన్నారు.ధర్మపురం డిస్ట్రిబ్యూటరీ పరిధిలో 12.25 కి మీ మేర 6,400 ఎకరాలు,అరిణాo అక్కివలస డిస్ట్రిబ్యూటరీ పరిధిలో 10.70 కి మీ మేర 6,100 ఎకరాలు పూర్తిస్థాయిలో సాగులోకి రానుంది అన్నారు.మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, శ్రీకాకుళం జిల్లా రైతుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలు తేటతెల్లం అయ్యిoదన్నారు. జిల్లాలో నాగవళి, వంశధార నదులను అనుసంధానం చేసే చర్యలను వైసిపి సర్కార్ చేపట్టిందన్నారు. ఇది పూర్తయితే జిల్లా అన్నపూర్ణగా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వ్యవసాయం పట్ల అత్యంత మొక్కవ కలిగిన ముఖ్యమంత్రి సాగునీటి వనరుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో భారీ నీటి ప్రాజెక్టులు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పూర్తయిన విషయాన్ని గుర్తు చేశారు. గొర్లె శ్రీరాముల నాయుడు మడ్డవలస రెండవ దశ విస్తరణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన సాగునీరు అందించేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు అన్ని వర్గాలకు చేరువ అయినప్పుడే రాష్ట్రం ప్రగతి పధ మార్గంలో పయనిస్తుందన్నారు.ఇదే విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఈ మూడు రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. సరిహద్దు జిల్లాలుగా ఉన్న విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలు రానున్న రోజుల్లో వ్యవసాయ పంటలు పూర్తిస్థాయిలో ఎగుమతి చేసే పరిస్థితి రావడం ఖాయమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది జలాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కిందన్నారు. నాగావళి జలాలను పూర్తిస్థాయిలోకి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ సాగుకు పండుగ వాతావరణాన్ని తీసుకువస్తామన్నారు. మడ్డవలస రెండవ దశ విస్తరణ పనులు పూర్తయితే వంగర,రేగిడి ఆమదాలవలస,సంతకవిటి,జి సిగడాం,పొందూరు తదితర మండలాలు రైతాంగానికి మేలు చేకూరుతుందన్నారు. మనసున్న ముఖ్యమంత్రి కి పాలనను అఖిలాంధ్ర ప్రజానీకం స్వాగతించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ పి ఏ సి ఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు