- జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
- అప్పులు చేసి డబ్బు పంచితే అది అభివృద్ధా?
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అప్పులు, తప్పుల చిట్టాలా ఉందని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ ని, వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలా మార్చేసిందన్నారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా ధర్నాలో పాల్గొన్న వి.వి.లక్ష్మీనారాయణ రాష్ట్ర బడ్జెట్ పై వ్యాఖానిస్తూ, అప్పులు చేసి డబ్బు పంచితే అది అభివృద్ధా? అని ప్రశ్నించారు. ఏపీలో గత అయిదు ఏళ్ళలో 4.25 లక్షల కోట్ల నగదు బదిలీతో పేదరికం తొలిగించామని ఆర్ధిక మంత్రి ఆత్మవంచన చేసుకున్నారని ఆయన విమర్శించారు. అప్పులు చేసి డబ్బులు పంచితే, అది పేదరిక నిర్మూలన ఎలా అవుతుందని జేడీ ప్రశ్నించారు. చేసిన అప్పు మరింత వడ్డీతో ప్రజల నెత్తిపైనే భారం పడుతుందన్నారు. 43 లక్షల మంది విద్యార్థులకు గోరు ముద్ద, 35 లక్షల మంది పిల్లలకు సంపూర్ణ పోషణ అని లెక్కలు చెప్పారని, ఇందులో వాస్తవమెంత అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార బడ్జెట్ లా, చివరికి ఎన్నికల ముందు హడావుడిగా టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కూడా ఎన్నికల స్టంటే అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన చెప్పినట్లు అంత అభివృద్ధి ఉంటే, ఏపీలో తెల్లకార్డులు ఎందుకు తగ్గడం లేదు? రోడ్లు ఎందుకు వేయడం లేదు? పరిశ్రమలు ఎందుకు రావడం లేదు? యువత ఉపాధి కోసం వలస ఎందుకు పోతున్నారని వి.వి.లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.