ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. ఓవైపు ప్రభుత్వం చేపట్టిన ఆర్ 5 జోన్ కు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమించారు. భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి తమ ఆగ్రహం తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వైసీపీ నేతలు.. అమరావతిలో చంద్రబాబు టూర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఉద్రిక్తతలు తప్పడం లేదు.ఇవాళ ఉదయం ఆర్ -5 జోన్ రద్దు చేయాలంటూ అమరావతి రాజధాని రైతులు రాజధాని గ్రామాలను కలుపుకుంటూ పాదయాత్ర ప్రారంభించారు. కష్ణాయపాలెం గ్రామంలో మెదలై మందడం, తుళ్ళూరు, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు వరకు ఈ పాదయాత్ర జరగనుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం నిడమర్రులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ పాదయాత్రలో అమరావతి రైతులు, అమరావతి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు.మరోవైపు ఇవాళ అమరావతిలో చంద్రబాబు కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అమరావతి జైల్ సింగ్ కాలనీలో రేపు చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు సిగ్గు సిగ్గు పేరుతో ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ తీరు పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో దుశ్చర్యలకు పాల్పడితే సహించబోమని టీడీపీ నేతలు చెప్తున్నారు. స్ధానికంగా లభిస్తున్న మద్దతుతో వైసీపీ నేతల్ని అడ్డుకుంటామని టీడీపీ నేతలు వెల్లడించారు.అటు అమరావతి లో వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కవ్వింపు చర్యగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు చంద్రబాబు అమరావతి పర్యటనకు పూర్తిస్ధాయిలో పోలీసులు భద్రత కల్పించాలని, సహకరించాలని శ్రీధర్ కోరారు.
దళితుల మధ్య అధికారపార్ట చిచ్చు పెడుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులపై అధికారపార్టీకి ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు..