జి ఈశ్వరయ్య ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు
కడప సిటీ :కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, భార్య పద్మావతి, కూతురు వినయ ఆత్మహత్యకు కారకులైన రెవిన్యూ అధికారులు, అధికార పార్టీ నేతల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించి శిక్షించాలని, కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, పెద్ద కూతురు లక్ష్మి కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఆదివారం మాధవరం లో మృతులకు నివాళి అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో అధికారులు అధికార పార్టీ నేతల భూ ధన దాహానికి అమాయక కుటుంబం బలి కావడం విచారకరమన్నారు. మృతుడు సుబ్బారావు తండ్రి చలపతి సోమశిల ప్రాజెక్టు నిర్మాణం కోసం అట్లూరు మండలంలోని భూములు ఇల్లు త్యాగం చేసి, ఒంటిమిట్ట మండలంలోని మాధవరం గ్రామంలో నివాసం ఉంటూ, ఒంటిమిట్ట గ్రామ పొలంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ, రెవిన్యూ రికార్డుల్లో కూడా నమోదు చేయించుకున్న చలపతి కరోనా సమయంలో చనిపోగా తన రెండో కుమారుడైన సుబ్బారావు తన తండ్రి బాధ్యతలు అన్ని తన భుజానికి ఎత్తుకొని జీవించే వారన్నారు.
సుబ్బారావు ఇద్దరూ కుమార్తెల చదువు, తమ్ముడు వివాహం ఆర్థిక సమస్యలు ఒకవైపు, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి మరోవైపు రావడంతో తన తండ్రి ద్వారా సంక్రమించిన ఏకైక ఆస్తి మూడు ఎకరాల భూమిని విక్రయించైన అప్పులు తీర్చుకుందాం అన్న ఆశపై, మండల తహసిల్దారు, స్థానిక వైసీపీ నాయకులు కుమ్మక్కై తన తండ్రి చలపతి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద నమోదు చేయడ జరిగిందని తీసుకెళ్లాడు. నా మాభూమి రికార్డుల్లో నమోదైన విషయమై పరిష్కరించమని అనేక పర్యాయాలు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడం, లక్షల రూపాయలు లంచాలు ఇచ్చిన స్పందించకపోవడం వంటి కారణాలతో విసుగు చెందిన సుబ్బారావు జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మరణాలకు అధికారులే కారణమయ్యారన్నారు.
సదరు భూమి పక్కనే నాలుగు లైన్ల రహదారి నిర్మాణం జరగడం వీరి అనుభవంలో ఉన్న భూమి విలువ పెరగడం వల్ల అధికారులు అధికార పార్టీ నేతలు ఒక ప్రణాళిక అబద్ధంగానే భూమి వివరాలు నమోదు చేయడంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.
వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో విలువైన ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈనామ్ భూములను ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే డీకేటి మాఫియా దుర్మార్గాల తో సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం మాఫియా కొమ్ముకాస్తుందన్నారు. ఒంటిమిట్ట మండలంలో భూ ఆక్రమణలపై పత్రికల్లో, టీవీల్లో పుంకాను పుంకాలు గా వ్యాసాలు వస్తున్నా అధికారులకు, అధికార పార్టీ నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఒకే భూమిపై రెండు హక్కు పత్రాలు తయారు చేసే డీకేటీ మాఫియా మండలంలో తయారయిందన్నారు.
వీరపునాయుని పల్లి మండలానికి చెందిన ఒక రైతు తన స్వాధీన అనుభవంలో ఉన్న భూమి డాట్ ల్యాండ్ గా ఉందని సదరు భూమి సవరణ కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేక కలెక్టరేట్లోని సెక్షన్ సూపర్నెంట్ ప్రమీల లంచం డిమాండ్ చేయగా 50,000 లంచం ఇస్తూ ఏసీబీకి పట్టించిన ఘటన, కలెక్టర్ చాంబర్ కు పక్కనే ఇలాంటి అవినీతి బాగోతం బట్టబయలైన అధికారుల్లో మార్పు రాకపోవడం దుర్మార్గమన్నారు.
అధికారులు చేసిన తప్పిదాలకు బాధితులు అనేక పర్యాయాలు విన్నవించిన లెక్క చేయకపోతే బాధితులపై భౌతిక పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపి ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్య చేసుకున్నవారు రెవిన్యూ వారిపై వ్రాసిన మరణ వాంగ్మూలాన్ని ప్రాతిపదికగా తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, పెద్దకూతురు లక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా డిఎస్పి షరీఫ్ ను కలిశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.వి సుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎన్ వెంకట శివ, మండల కార్యదర్శి యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.