భారతీయ జనతా పార్టీలో వర్తమానంలో ప్రముఖంగా వినిపిస్తున్నవి రెండే పేర్లు..
ఒకటి..సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పేరు దేశం మొత్తం మీద మారుమ్రోగిపోతూనే ఉంది.ఇక 2014 లో దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ ఒక ప్రబలమైన శక్తిగా దేశ..అంతర్జాతీయ స్థాయిలో
ఎదిగి పోయారన్నది తిరుగులేని నిజం.ఇది బిజెపి ..అంతకుమించి ఆరెస్సెస్ ఊహించని పరిణామం.మోడీ ఈ దేశానికి ఏం చేశారన్నది ఇక్కడ ప్రస్తావించబోవడం లేదు.ఇది బిజెపి అంతర్గత వ్యవహారాలకు సంబందించిన కథనం.అంతేకాని బిజెపి సక్సెస్ స్టోరీ కాదు.మొత్తానికి
అంచనాలను మించి మోడీ
ఎంతలా ఎదిగారంటే
మోడీ అంటేనే బిజెపి..
బిజెపి అంటే మోడీ అన్నంతగా..!
ఇక్కడితో
మోడీ కథకు కామా పెట్టి
మొదట పేర్కొన్న ఇద్దరిలో రెండో వ్యక్తి గురించి తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో విపరీతమైన ప్రచారం జరుగుతూ భారతీయ జనతా పార్టీకి సిసలైన సింబల్ గా..కమలం పార్టీకి
ప్రధాన ముద్ర అయిన హిందుత్వానికి ఆహార్యంలో గాని..వ్యవహారంలో గాని
బ్రాండ్ అంబాసిడర్ గా రాణిస్తున్న
యోగి ఆదిత్యనాధ్ దాస్..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి..!
ఇప్పుడు దేశంలో నడుస్తున్నది ఆయన హవా..
బిజెపిలో ఆయన
నయా నాయకుడు..
కాబోయే దేశోద్ధారకుడు..!
ఇప్పుడు అసలు కథకి వస్తే దేశంలో ఇటీవలి కాలంలో
మోడీతో సమానంగా ప్రచారం జరుగుతున్నది యోగి గురించే..బాగానే ఉంది..అయితే ఇదంతా
ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్టు అనిపించడం లేదూ.. ఒకనాడంటే మోడీ గురించి బిజెపి పని కట్టుకుని ప్రచారం చేసింది కాని ఇప్పుడు మోడీకి ఆ పరిస్థితి లేదు.
ఆయన కోరకుండానే..
జాతీయ..అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు విశేష ప్రచారం లభిస్తోంది.మోడీ ఇప్పుడు వరల్డ్ లీడర్..
ఇక్కడే బిజెపి ఆలోచనలో మార్పు వచ్చినట్టు అనిపిస్తోంది..వ్యక్తి ప్రాధాన్యత..వ్యక్తిగత ప్రతిష్ట..
వీటికి పెద్దపీట వేయని బిజెపి..ఆరెస్సెస్ లో
ఇక మోడీ ప్రభంజనానికి
ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనకు బీజాలు పడినట్టు అనిపిస్తోంది.
ఆ నేపథ్యంలోనే అనూహ్యంగా యోగి ఆదిత్యనాధ్ దాస్ కు విపరీతంగా ప్రచారం పెరిగిపోతోంది.ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొన్ని మంచి పనులు చేస్తుండవచ్చు గాక..
అయితే దేశంలో ఏ ప్రభుత్వ అధినేత కూడా యోగిలా చెయ్యలేదనే స్థాయిలో
ఈ ప్రచారం జరగడం కొంత అసహజంగా ఉండి ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి కాకపోయినా ఆ తర్వాత ఏదో ఒక దశలో మోడీని
ఎలాగోలా పక్కకి తప్పించి
యోగిని కేంద్రంలో అధికారపీఠం ఎక్కించే అవకాశాలు లేకపోలేదు.
2024 ఎన్నికలకైతే బిజెపి
మోడీ బొమ్మతోనే వెళ్లక తప్పదు.లేదంటే బొమ్మయిపోయే ప్రమాదం ఉంటుంది.
నిజానికి మూడోసారి ప్రధాని అనేది బిజెపి..ఆరెస్సెస్ నిబంధనలకు వ్యతిరేకమేమో..అయితే ఇప్పటికప్పుడే యోగిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే దుస్సాహసానికి బిజెపి తెగబడదు.మరోసారి గెలిచి అధికారం అందుకున్న తర్వాత అసలు కథకి తెర ఎత్తవచ్చు ..ఈలోగా యోగి దాస్ ను ప్రమోట్ చేసే కథ అలా రసవత్తరంగా నడుస్తూనే ఉంటుంది..సందేహం లేదు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ కు ఎక్కువ ప్రచారం జరుగుతోంది.ఆయన హిందుత్వ ఉద్ధరణ కోసమే ఉద్భవించినట్టు ప్రచారం కొనసాగుతుండడం మరో విశేషం.అదే సమయంలో పనిలో పనిగా యోగి విద్యార్హతలు..ఆయనకు గల ఇతర అర్హతలు..
గుణాలు..లక్షణాలు..
అన్నిటికీ విపరీతమైన ప్రచారం.ఇంకో విషయం…
ఈ ప్రచారం జరుగుతుండగానే మోడీ విద్యార్హతలపై కూడా ఒక ప్రచారం మొదలైంది.
అదే సమయంలో యోగి వయసు..మోడీ ముదిమి..(యోగి 50..మోడీ 70 ప్లస్)
ఇవన్నీ ప్రచార..ప్రసార అంశాలుగా మారాయి.
యోగి జీవన విధానం..
ఆయన నిరాడంబరత ..
మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం..
లెక్కల్లో పాండిత్యం..
కంప్యూటర్ పరిజ్ఞానం..వాట్ నాట్..కాదేదీ ప్రచారానికి అనర్హం..
మోడీ ఆడంబరాలు..
ఆయనపై జరుగుతున్న ఖర్చు ..విలాసవంతమైన జీవన విధానం..వీటిపై ప్రచారం మరోవైపు..
ఇవన్నీ ఒకేసారి ఊపందుకోవడం యాదృచ్ఛికమా..వేరేవారు కాకతాళీయంగా చేస్తున్న ప్రచారమా..?
ఏమో..ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.బిజెపిలో ఇలాంటివి షరా మామూలే..
అంతటి అద్వానీకే తప్పలేదు.
అయితే ఇంతటి ప్రణాళికలో బిజెపి అత్యంత కీలక వ్యూహకర్త అమిత్ షా పాత్ర ఉందా..ఉండదేమో..
అమిత్..మోడీ..ఇద్దరూ ప్రాణమిత్రులు కదా…ఇలాంటి లకిక్కులన్నీ రాజకీయాల్లో సిల్లీ..
అద్వానీ..వాజపేయి స్నేహమే మకిలి అంటకుండా చివరి వరకు సాగలేదు.
ఇక వెంకయ్యనాయుడు విషయంలో ఎన్ని రాజకీయాలు నడిచాయో
ఈ దేశం చూడకపోలేదు.
ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్..!
సురేష్ కుమార్ ఇ
జర్నలిస్ట్
9948546286