కోపమొచ్చి ఎదటోడిని
చెడామడా తిట్టేయడం కాదు
ఛీ..ఇదేమి వ్యవస్థ..
దీన్ని మార్చడం
ఎవడి వల్లా కాదని
విసిగిపోవడం
అంతకంటే కాదు..
నీ చుట్టూ నీకు నచ్చనివి
ఎవరూ మెచ్చనివి
ఎన్నో జరుగుతున్నా
చూస్తూ నీలో నువ్వే రగిలిపోవడం
కానే కాదు..
అది బాలేదు..ఇది ఘోరమని
వేదికలెక్కి ఊకదంపుడు
ఉపన్యాసాలు
ఇచ్చుడు కాదు..
ఇది సమాజం..
ఇందులో నువ్వూ ఉన్నావు
నీ కళ్ళెదుట జరుగుతున్న
అన్యాయాన్ని ఎదిరించు..
వ్యవస్థను మార్చలేకపోయినా
ఆ దిశగా
ఓ ప్రయత్నం చెయ్యి..
ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తే
ఒకనాటికి అదే యజ్ఞమై..
మార్పు కాకపోయినా
అనుకూలమైన ఓ తీర్పు..
మరోనాటికి
వెలిగిపోయే తూర్పు..!
మాటలు కోటలు దాటే
బూటకపు వీరుల్లో
నువ్వూ ఒకడివి కావద్దు..
నీలో చేవ చావక కాస్తయినా
మిగిలి ఉంటే..
తిరగబడే సత్తా
నీలో ఉందని నిరూపించుకో
నువ్వు మనిషివేనని..
ఆపై మగాడివేనని
లోకం సంగతి తర్వాత
నీకు నువ్వు రుజువు చేసుకో!
సురేష్ కుమార్ ఇ
9948546286