ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రసాదం. ఆలయంలోని దేవుడికి ప్రసాదంగా ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రసాదం పెడతారు. లడ్డు, పులిహోర, చక్రపొంగలి తదితర ప్రసాదాలు పెడతారు. కానీ ఆ ఆలయంలో దేవుడికి ప్రసాదంగా వాచీని, గడియారాలను సమర్పిస్తారు. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రమాదాలు, అశుభాలు జరగవని అక్కడి ప్రజల నమ్మకం. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్లోని జౌన్ పూర్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు పూలమాలలు సమర్పించే బదులు ఆలయంలో గడియారాలను సమర్పిస్తారు. ఈ ఆలయంలో దాదాపు 30 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ వింత నైవేద్యాల కారణంగా ఈ ఆలయం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. బ్రహ్మ బాబా ఆలయం ప్రత్యేకత.. ఒక వ్యక్తి మంచి డ్రైవర్ కావాలనే కోరికతో బ్రహ్మబాబా ఆలయానికి వచ్చాడు. బాబా గుడిలో కోరిక నెరవేరి మంచి డ్రైవర్‌గా మారాడు. సంతోషంతో ఆ వ్యక్తి ఈ ఆలయంలో గడియారాన్ని సమర్పించాడు. అప్పటికి దేవుని గుడిలో గడియారం లేదు . అలా ఈ ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ఆనోటా ఈ నోటా ప్రజలకు తెలియడంతో.. ప్రజలు ఆలయంలో గడియారాలను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం వెలుపల ఒక మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టుకి మొక్కులు చెల్లిస్తూ గడియారాలను కడతారు. ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆలయంలో నైవేద్యంగా సమర్పించే వాచీలను ఎవరూ దొంగిలించలేరు. ఏడాది పొడవునా ఈ ఆలయాన్ని చూడడానికి వస్తూనే ఉంటారు.