అమరావతి:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో ఎప్పటిలానే బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,99,756 మంది విద్యార్థులు హాజరుకాగా 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 5,02,394 మంది విద్యార్థులు హాజరుకాగా, 78 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మందిలో 71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి వివరించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 71 శాతం మంది, బాలురు 64 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది బాలికలు, 75 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు జిల్లా, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 48 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అలాగే, రెండో సంవత్సరం ఫలితాల్లో 92 శాతంతో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానాన్ని దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. అలాగే, రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజులు చెల్లింపునకు ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 24వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు సిప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.