పారుపల్లి నవీన్
అంతన్నారూ….ఇంతన్నారూ..ఏలేరు జలాలు మళ్ళించి తాండవ ఆయకట్టును సశ్యశ్యామలం చేస్తామన్న పాలకుల మాటలు నీటిమూటలయ్యాయి. ఎత్తిపోతల పథకానికి రెండేళ్ల కిందటే పునాది రాయి పడిన పనులకు అతి గతి లేకుండా పోయింది. కాగితాలకే పరిమితమైన తాండవ ఎత్తిపోతల పథకం మాట దేవుడెరుగు. ఉన్న నీరు లీకు కాకుండా గేట్లు పట్టిష్ట పర్చకపోవడం పై ఆయకట్టు దారులు రుసరుసలాడుతున్నారువాగ్ధానం భంగం.పాలకుల మాటలు నీటి మూటలు.ఆశలు ఆవిరి.అంతా ఆరంభశూరత్వమే.చివరికి ఎదురు చూపులే.ఇవన్నీ తాండవ ఆయకట్టు రైతుల ఆవేదనా… ఆక్రోశం.తాండవ జలాశయం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు నియోజవర్గాల పరిధిలో గల సుమారు 51650 ఎకరాలకు సేద్యపు నీటి కోసం నిర్మితమయింది.రిజర్వాయర్ పూర్తి స్థాయిలో స్థిరీకరణకు నోచుకోలేదు.దీంతో ఏయేటికాఏడాది ఆయకట్టు దారులకు సేద్యపు నీటి కడగండ్లే.ఈపరిస్థితుల్లో వ్యవసాయం దైవాదీనం.ఆటుపోట్లు నడుమ అరకొర దిగుమతులతో పెట్టుబడులు సైతం దక్కని పరిస్థితులను అన్నదాతలు ఎదుర్కొంటున్నారు.రైతుల ఎదురు చూపులను పసిగట్టిన వైకాపా నేతలు అన్నదాతల ఓట్లకు గాలం వేసేందుకు ఏలేరు జలాల మళ్ళింపును ఎరజూపారు.ఏలేరు నీటిని ఎత్తిపోతల పథకం కింద తాండవాకు మళ్ళించి ఈ ఆయుకట్టును మరో డెల్టాచేస్తామని డాంబికాలు పలికారు.ఇంకేముందీ రైతాంగం కల సాకారం కాబోతుందనీ ఆశ పడ్డారు.కాల తాపన తర్వాత రెండేళ్ళ కిందట సీఎం చేతుల మీదుగా పునాది రాయి పడింది.స్టీల్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే ఏలేరు కాల్వపై ఆరు చోట్ల ఎత్తిపోతలకు జలవనరుల శాఖ ప్రతిపాదించింది.ఇందు కోసం 470 కోట్లు విడుదల చేయగా,ఇందులో ఏలేరు కాల్వ నీటి సామర్థ్యం పెంపునకు 250 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు కట్టారు.అబ్బో తాండవ ఆయకట్టు డెల్టాకు మయమరిపిస్తుందని అన్నదాతలు సంబరపడ్డారు.అయితే ఇదంతా ఆరంభం శూరత్వమయింది.
పనుల్లో
ముందడుగు పడలేదు.ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఎత్తిపోతల పథకం ఉంది.తలా తోకా లేని ఎత్తిపోతల పథకం మాట ఏమోగాని,ఉన్న నీరు వృదా పాలవుతుంటే పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారని రైతాంగం ఆరోపిస్తోంది.నీటి విధానం అరికట్టేందుకు గేట్లు మరమ్మతులకు,5లక్షలు మంజూరు చేయలేని ప్రభుత్వం వందల కోట్లతో ఎత్తిపోతల పథకం అంటున్న వైనం కన్న తల్లికి కూడు పెట్టినోడు పిన్నమ్మ కు కోక పెట్టాడట అన్న సామెత గుర్తుకు వస్తోంది