Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్ఉత్కంఠగా ఝార్ఖండ్‌ రాజకీయం...నేడే బలపరీక్ష

ఉత్కంఠగా ఝార్ఖండ్‌ రాజకీయం…నేడే బలపరీక్ష

రాంచీ: ఝార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నేడు సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని జేఎంఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వారందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు జేఎంఎం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లాబిన్‌ హెమ్‌బ్రోమ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
త్వరలోనే ఆ పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటానని, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీ వేదికగా గళమెత్తుతానని లాబిన్‌ హెమ్‌బ్రోమ్‌ అన్నారు. తన సలహాను విస్మరించినందుకే మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ” చోటా నాగ్‌పుర్‌ అద్దె చట్టం, సంథాల్‌ పరగణాల అద్దె చట్టం తీసుకొస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జేఎంఎం పేర్కొంది. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కేంద్రం ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ చట్టం-1996 ని కూడా ఇక్కడ అమలు చేయలేదు. తొలి రెండు చట్టాలు గిరిజనులకు భూ హక్కులు కల్పించేవి కాగా, పీఈఎస్‌ఏ చట్టం గ్రామసభలకు బలాన్నిస్తుంది. గిరిజనుల హక్కులను కాపాడుతుంది. కానీ, ఈ మూడింటినీ హేమంత్‌ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకే ఝార్ఖండ్‌ బచావో మోర్చా ఫోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది” అని లాబిన్‌ హెమ్‌బ్రోమ్‌ అన్నారు.చాలామంది జేఎంఎం ఎమ్మెల్యేలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని హేమంత్‌ సోరెన్‌ను పలుమార్లు హెచ్చరించానని, ఆయన జాగ్రత్త పడకుండా అనవసరపు మాటలాడొద్దని తిరిగి నన్నే దూషించారని అన్నారు. అందుకే ఇప్పుడు ప్రతిపక్షానికి అవకాశమిచ్చినట్లవుతోందని వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టులు, డ్యామ్‌లు, పరిశ్రమల పేరుతో గిరిజనుల భూములను స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ఝార్ఖండ్‌ ప్రభుత్వానికి అధినేత గిరిజనుడే అయినా.. గిరిజనేతరుల నేతృత్వంలోనే నడుస్తోందని ఆక్షేపించారు. ఇప్పటికీ బిహారీల ప్రభావం రాష్ట్రంపై ఉందని ఆరోపించారు.
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 47 మంది మద్దతు తమకు ఉందని జేఎంఎం సంకీర్ణ కూటమి గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. అయితే, వారిలో కొందరి నుంచి స్పందన కొరవడినట్లు సమాచారం. ఓవైపు లాబిన్‌ హెమ్‌బ్రోమ్‌ తిరుగుబావుటా ఎగరేయగా.. బిష్ణుపర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చమ్రా లిండా కూడా ఇప్పటి వరకు టచ్‌లోకి రానట్లు తెలుస్తోంది. బలప్రదర్శన నేపథ్యంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగానే హాజరుకాలేదని జేఎంఎం నేతలు చెబుతున్నా.. చంపయీ ప్రభుత్వానికి ఆయన వ్యతిరేకంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గిరిజనుల సంక్షేమానికి సరైన చర్యలు తీసుకోలేదన్న కారణంతో దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోని రిసార్టులో చంపయీ సోరెన్‌తో సహా 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. చమ్రా లిండా, హెమ్‌బ్రోమ్‌తో కలిపితే మొత్తం 42 మంది. మిగతా ఐదుగురి ఎమ్మెల్యేల గురించి స్పష్టమైన సమాచారం లేదు. వీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారో? లేదో?కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ ఊహించని పరిణామాలు ఎదురైతే బలపరీక్షలో సంకీర్ణ కూటమి ఓడిపోయే అవకాశాలున్నాయి. కానీ, జేఎంఎం మాత్రం తమకు కచ్చితంగా 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెబుతోంది. హైదరాబాద్‌ లియోనియా రిసార్ట్‌లోని 39 మంది ఎమ్మెల్యేలు రాంచీకి బయలుదేరారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకోనున్నారు. వారివెంట కాంగ్రెస్‌ నాయకులు మల్‌రెడ్డి రాంరెడ్డి, సంపత్‌కుమార్‌, కార్పొరేటర్లు పరమేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article