*గతంలోవలే ఐజి స్థాయి అధికారి స్మగ్లర్లపై నియంత్రణ, పర్యవేక్షణ ఉండాలి
- *కానిస్టేబుల్ అంతిమయాత్ర
*కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
*పరిటాలశ్రీరామ్, బికెపార్థసారథి డిమాండ్
ముదిగుబ్బ(ధర్మవరం)
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల అణిచివేతపై ప్రభుత్వం మొదటినుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. కనుకనే ఇవాళ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడని ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి పరిటాలశ్రీరామ్ విమర్శించారు. తిరుపతి సమీపంలో మంగళవారం ఎర్రచందనం స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టిన సంఘటనలో మృతిచెందిన కానిస్టేబుల్ గణేష్ పార్థివదేహానికి పరిటాల శ్రీరామ్ నివాళులర్పించారు. తిరుపతి సమీపంలో వాహనాల తనిఖీల్లో భాగంగా విధుల్లో ఉన్న బిల్లేగణేష్ ను ఎర్రచందనం స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టి పారిపోయారు. ఈఘటనలో గణేష్ ప్రాణాలు కోల్పోగా మృతదేహాన్ని స్వగ్రామమైన ధర్మవరం మండలపరిధిలోని గుట్టకిందపల్లి గ్రామానికి తీసుకురావడంతో గ్రామమంతా విషాదఛాయలు నెలకోన్నాయి. బుధవారం ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాలశ్రీరామ్, హిందూపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు బికెపార్థసారధి వచ్చి గణేష్ పార్థివ దేహానికి నివాళులర్పించి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. ఈసందర్భంగా పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రించడంలో గణేష్ సాహసోపేతంగా వ్యవహరించారని కొనియాడారు. ప్రకృతి సంపద స్మగ్లర్ల చేతిపాలు కాకూడదని గణేష్ చేసిన ప్రయత్నంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల మీద ప్రత్యేక నిఘా ఉండేదని.. ఐజి స్థాయి అధికారితో నిత్యం పర్యవేక్షణ కూడా ఉండేదని అన్నారు. కానీనేడు ప్రభుత్వంలో అలాంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. దీంతో ధైర్యంగా పోలీసులు ముందడుగు వేయలేకపోతున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే చాలామంది చనిపోవడం గాయాల పాలవడం జరిగిందని, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. నీటికైనా ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేస్తూ ఆకుటుంబానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఒక్కగానోక్కా కొడుకైనా కానిస్టేబుల్ గణేష్ ను కోల్పోయిన ఆతల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, గణేష్ కి ఇద్దరు పిల్లలుకూడా వున్నారని , వారికుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవడం తోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.