ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్
బుట్టాయగూడెం.
రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో ఏజేన్సీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. స్థానిక ఆదివాసి విజ్ఞాన కేంద్రం, గిరిజన సంఘం భవన్ లో బుధవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వై.అర్ సిపి పార్టీ గత ఎన్నికల హామీలో ప్రతి ఏడాది జనవరిలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల వాగ్దానం చేసి ఐదేళ్లు గడిచిపోయినప్పటికీ, అమలు చెయ్యలేదని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు తాజాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర క్యాబినేట్ 6100 పోస్టుల డీఎస్సీ ని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కేవలం 6100 పోస్టులు ప్రకటించడంపై ప్రశ్నించారు. వైసిపి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఏజేన్సీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించలేదని అన్నారు. 2014 లో చివరిగా ప్రత్యేక డీఎస్సీ ని అప్పటి ప్రభుత్వము తీశారని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి స్పెషల్ డీఎస్సీ అతీగతీ లేకుండ చేసి ఆదివాసీ నిరుగ్యోగులకు అన్యాయం చేసిందనీ ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన క్యాబినేట్ సమావేశంలో స్పెషల్ డీఎస్సీ ప్రకటించకుండా, మరోసారి ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం చేసిందని తెలిపారు. జీఓ నంబర్ 3 రద్దు తర్వత స్పెషల్ డీఎస్సీ లేకుండ పోయిందని, జీఓ 3 రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏజేన్సీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.