Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుఐపీఎల్ 2024 : నాలుగు మ్యాచ్‌లలో ఓడిన ముంబై… నాలుగు మ్యాచ్‌లలో గెలిచిన చెన్నై

ఐపీఎల్ 2024 : నాలుగు మ్యాచ్‌లలో ఓడిన ముంబై… నాలుగు మ్యాచ్‌లలో గెలిచిన చెన్నై

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఇది చెన్నైకు నాలుగో విజయం కాగా, ముంబై జట్టుకు నాలుగు ఓటమి. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి ఆ తర్వాత రెండింటిలో గెలిచిన ముంబై ఇండియన్స్‌కు చెన్నై గట్టి షాకిచ్చింది. గత రాత్రి సొంత స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. 20 పరుగుల తేడాతో విజయం సాధించిన చెన్నై నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, ముంబైకి ఇది నాలుగో ఓటమి.కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 207 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ముంబై ఇండియన్స్ తొలుత దూకుడుగా మొదలుపెట్టింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ జోడీ జోరుగా ఆడింది. అయితే, 70 పరుగుల వద్ద తొలి వికెట్‌గా ఇషాన్ కిషన్ (23) వెనుదిరిగిన తర్వాత ముంబైకి కష్టాలు మొదలయ్యాయి. గత మ్యాచ్ వీర బాదుడు బాదిన సూర్యకుమార్ యాదవ్ రెండు బంతులే ఆడి డకౌట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పతిరన వీరిద్దరినీ వెనక్కి పంపి ముంబైని దెబ్బకొట్టాడు.సూర్య తర్వాత వచ్చిన తిలక్ వర్మ (31) ఫరవాలేదనిపించాడు. రోహిత్ శర్మకు అండగా నిలుస్తూ స్ట్రైక్ రొటేట్ చేసే ప్రయత్నం చేశాడు. అతడు అవుటయ్యాక మాత్రం జట్టు ఇక కోలుకోలేకపోయింది. పతిరన దెబ్బకు బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) కూడా ఉసూరుమనిపించాడు. టిమ్ డేవిడ్ (13), షెపర్డ్ (1) కూడా చేతులెత్తేయడంతో ముంబై ఓటమి ఖాయమైంది. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే వెనుదిరుగుతున్నా రోహిత్ శర్మ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ (105) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. 8 పరుగులకే రహానే (5) వికెట్ కోల్పోయిన చెన్నైకి పవర్ ప్లే కలిసి రాలేదు. కేవలం 48 పరుగులతోనే సరిపెట్టుకుంది. క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన రచిన్ రవీంద్ర (21) కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే జంట స్కోరు బోర్డును పరుగులెత్తించింది. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించారు.గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, దూబే 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 4 బంతుల్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన చెన్నై బౌలర్ పతిరనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరుగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article